రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది సామెత. ఇది దాసరి, చిరుకు సరిగ్గా సరిపోతుంది. ఒకరంటే ఒకరికి పడని ఈ సినీ జీవులు ఇప్పుడు సోలోగీతం వదిలేసి కాపుల కోసం యుగళగీతం పాడుతున్నారు. ఇది చూసేవారికి చిత్రంగా, అసహ్యంగా కనిపిస్తోంది. సుదీర్ఘ సినీ జీవితం ఉన్న వీరిద్దరు ఇంతకాలం తమ సినిమాల ద్వారా చెప్పిన నీతులు ఏమయ్యాయి.
పదవులు అనుభవిచడం మినహా దాసరి ప్రజల కోసం చేసిందేమి లేదు. బొగ్గు కుంభకోణంలో ఆయన పాత్రపై ఛార్జిషీట్ దాఖలైంది. దీనికోసం నెలకు రెండు సార్లు ఢిల్లీ వెళ్లి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. శ్వేతదుస్తులధారిపై మచ్చ పడింది. దీనినుండి తప్పించుకునే మార్గం కోసం వెతుకుతున్నారు. సైలెంట్ గా ఉంటే తననెవరూ పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఆయనలో ఉంది. అందుకే అవకాశం చూసి చూసి కుల మార్గాన్ని ఎంచుకున్నారు. ఇక చిరంజీవి అన్నీ అనుకూలంగా జరిగి ఉంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది. అందరివాడుగా సినిమాల్లో కనిపించిన మెగాస్టార్ అవకాశం రాగానే కాపువాడిగా మారారు. ఒక స్టార్ హోదాలో ఉన్నారు. తన కుటుంబసభ్యులను సైతం సినీరంగానికి పరిచయం చేశారు. అన్ని వర్గాల ఆమోదం పొందుతున్న తమ కుటుంబహీరోలను సైతం ఇబ్బందిలో పడేసే పనికి పాల్పడ్డారు. కుల చిచ్చు ఎంత ప్రమాదకరమో చిరంజీవికి తెలియకపోవచ్చు. తాత్కాలిక ప్రయోజనాల కోసం తప్పటడుగు వేశారు. దీని పర్యవసానం భవిష్యత్తులో తెలుస్తుంది. కుటుంబ హీరోల సినిమాలకు బి.సి.వర్గాల నుండి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది.
ఇలాంటి వైరుధ్యం కలిసిన దాసరి, చిరు కులం కోసం ఒక్కటి కావడం అవకాశ రాజకీయాలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు.