ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు అధికార పక్షాలలోకి జంప్ చేయడం ఎప్పటినుండో చూస్తూనే ఉన్నాం. అది ఎప్పటినుండో అందరినీ మరీ ముఖ్యంగా భారతదేశ ప్రజాస్వామ్యానికి పెద్దసవాల్‌గా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు మరింత పెచ్చరిల్లింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతాకాదు. దీంతో ప్రతిపక్షాలు బలహీనపడుతున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షాల ఆందోళనకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని చెప్పక తప్పదు. ఫిరాయింపులకు పాల్పడ్డరోజునే సదరు నాయకులపై అనర్హత వేటు పడాలని వెంకయ్య సూచించారు. ఫిరాయింపు చట్టంలో తగిన మార్పులు చేయడానికి ప్రభుత్వం తరపున తాను మాట్లాడుతానని, ఈ చట్టంలో సవరణలను తాను ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లతానని ఆయన ప్రకటించారు. దీంతో ఆంద్రాలో వైసీపీ, తెలంగాణలోని టిడిపి, కాంగ్రెస్ వంటి పక్షాలు ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రంలో బిజెపికి పూర్తిస్దాయి మెజార్టీ ఉన్న నేపధ్యంలో ఫిరాయింపు చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు కొందరు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం పార్టీలను నమ్మడానికి లేదని, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను వ్యతిరేకిస్తారని, అదే వారే అధికారంలోకి వస్తే వారు చేసే పనులు కూడా అవే కాబట్టి ఏ పార్టీ కూడా ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని చిత్తశుద్దిగా పనిచేయదని ముక్తాయింపునిస్తున్నారు. దీనికి ఉత్తరాఖండ్‌లో బిజెపి చేసిన వ్యవహారమే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇక ఈ చట్టంలో ఫిరాయింపులపై స్పీకర్‌కు ఉన్న అధికారాలను ఎన్నికల సంఘానికి బదలాయించాలనే డిమాండ్ ఇప్పుడు జోరందుకుంది.