ఒక ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోయిన హీరోలు కొంతకాలం తర్వాత కనుమరుగవుతూ ఉంటారు. వారి ఏజ్‌కు, ఇమేజ్‌కు తగ్గ కథలు రాక గోళ్లు గిల్లుకుంటూ ఉండే పరిస్థితి. ఇక ఫ్యామిలీ హీరోగా ఒకప్పుడు మంచి ఇమేజ్ సాధించిన జగపతిబాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా స్టార్‌హీరోల చిత్రాలకు కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్దితిలో ఉన్నాడు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలో కూడా ప్రస్తుతం ఆయన హవా నడుస్తోంది. ఇక సుమన్, వినోద్‌కుమార్, రఘు వంటి నటులు కూడా ఇదే దారిలో నడుస్తున్నారు. కాగా సినిమా పరిశ్రమలోకి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో పేరు తెచ్చుకుని, ఆ తర్వాత హీరోగా అదరగొట్టిన రాజశేఖర్ త్వరలో గోపీచంద్ సినిమాలో విలన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సీనియర్ హీరో కూడా విలన్‌పాత్రలు చేయడానికి రెడీ అవుతున్నాడు. తన కెరీర్ స్టార్టింగ్‌లో యంగ్‌విలన్ క్యారెక్టర్లు చేసి... ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్. ఆయన చిరంజీవితో కలిసి ఏటీఏం పాత్రలు చేసిన 'శంకర్‌దాదా ఎంబిబియస్, శంకర్‌దాదా జిందాబాద్' చిత్రాల్లో నటించి మెప్పించాడు. కాగా ఇటీవల కాలంలో తన వయసుకు తగ్గ పాత్రలు రాకపోతుండడం, మరోవైపు ఫ్యామిలీ ఇమేజ్ వల్ల... ఆ తరహా చిత్రాలు తగ్గిపోవడంతో రామ్‌చరణ్‌కు బాబాయ్‌గా 'గోవిందుడు అందరివాడేలే', అల్లుఅర్జున్‌కు బాబాయ్‌గా 'సరైనోడు' చిత్రాల్లో నటించాడు. ఇక మీదట కూడా అలాంటి పాత్రలతో పాటు పూర్తిస్దాయి విలన్ పాత్రలు చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు. మరి శ్రీకాంత్.. జగపతిబాబు, అరవింద్‌స్వామి.. లా సక్సెస్ అవుతాడో? లేక సుమన్, వినోద్‌కుమార్, వడ్డేనవీన్, రఘు, జెడిచక్రవర్తిలలాగా ఏదో ఒక పాత్రలతో రాజీపడతాడో భవిష్యత్ తేల్చనుంది.