వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మినీ సార్వత్రిక పోరును తలపించేలా సాగే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను మోదీ పాలనకు రెఫరెండంగా భావించవచ్చు. దీంతో ఇప్పటికే ఆ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో గెలిచేందుకు సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు తమ ఎత్తుగడలకు పదునుపెడుతున్నాయి. ఇక జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లకు ఈపోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనుంది. కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ దేశంలోని ప్రతిరాష్ట్రంలోనూ ఘోర వైఫల్యాలను రుచిచూస్తోంది. మరోవైపు బిజెపి మాత్రం సమరోత్సాహంతో ఉరకలు వేస్తోంది. ఈ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌లు తమ సీఎం అభ్యర్ధులుగా ఎవరిని పెడతారనే చర్చ జోరుగా సాగుతోంది. మేనకగాంధీ కుమారుడైన వరుణ్‌గాంధీకి యూపీలో మంచి క్రేజ్ ఉందని ఇటీవల అక్కడ జరిగిన పలు సర్వేలు తేల్చేశాయి. అదే సమయంలో కాంగ్రెస్ తరపున సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీని నియమిస్తేనే కాంగ్రెస్‌కు కొద్దిపాటి పరువు అయినా నిలబడుతుందని ఆ సర్వేలు తేల్చాయి. మరి ఈ రెండు పార్టీలు వరుణ్‌గాంధీ, ప్రియాంకాగాంధీలను ముఖ్యమంత్రి అభ్యర్ధులుగా నిలబెడితే అది గాంధీ కుటుంబ వారసుల (ప్రియాంకాగాంధీ గాంధీ కుటుంబ వారసురాలు కాకపోయినా ఆమెను కూడా ప్రజలు ఓ వారసురాలిగానే భావిస్తున్నారు) మధ్యపోరుకు తెరతీసినట్లు అవుతుందని అంటున్నారు.