తన కెరీర్ మొదట్లో 'తలంబ్రాలు, ఆహుతి' వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న యాంగ్రీ ఓల్డ్ మేన్ రాజశేఖర్. ఆ తర్వాత కాలంలో ఆయన హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఆయన మంచి పాత్రలు వస్తే మరలా విలన్‌గా నటించడానికి సిద్దంగా ఉన్నానని ఎప్పుడో ప్రకటించాడు. తేజ దర్శకత్వంలో 'అహం' అనే చిత్రం రానుందని, అందులో రాజశేఖర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడని సమాచారం వచ్చినా ఆ చిత్రం ఇప్పుడేమయిందో అర్ధం కావడం లేదు. జగపతిబాబు వంటి నటులు విలన్లుగా బాగా ఆదరణ పొందుతూ, ఇటు జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్‌తో పాటు జేబు శాటిస్‌ఫ్యాక్షన్ కూడా పొందుతున్నారు. తాజాగా రాజశేఖర్ ఓ చిత్రంలో హీరోకు పోటాపోటీగా ఉండే నెగటివ్‌పాత్ర పోషించడానికి ఒప్పుకున్నాడు. 'లక్ష్యం, లౌక్యం' వంటి చిత్రాలతో విజయం సాధించిన దర్శకుడు శ్రీవాస్, హీరో గోపీచంద్ కాంబినేషన్‌లో త్వరలో హ్యాట్రిక్ ఫిల్మ్ రూపొందనుంది. ఈ చిత్రంలో గోపీచంద్‌కు విలన్‌గా రాజశేఖర్ నటించడానికి ఒప్పుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ 'ఆక్సిజన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే శ్రీవాస్ చిత్రం పట్టాలెక్కనుంది. మరో ముఖ్యవిషయం ఏమిటంటే గోపీచంద్ కూడా హీరోగా తన తొలిచిత్రం ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత విలన్ పాత్రలను చేసి మరలా హీరోగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.