ఇటీవల గుత్తాతో పాటు పలు కాంగ్రెస్ నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ఇప్పుడు జానారెడ్డి..పార్టీ చేరికలపై మాట్లాడుతున్నారని, కానీ తమ పార్టీకి చెందిన మాజీ ఎంపీ విజయశాంతి, అరవింద్‌రెడ్డిలను కాంగ్రెస్‌లోకి తీసుకున్నారని, అప్పుడు జానారెడ్డి ఎందుకు మౌనం వహించారంటూ విమర్శలు చేశాడు. తాజాగా ఈ వ్యాఖ్యలకు రాములమ్మ విజయశాంతి.. కేసీఆర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తానంతట తాను టిఆర్‌ఎస్‌ను వీడలేదని, కొందరి చెప్పుడు మాటల వల్ల తనను టిఆర్‌ఎస్ నుండి సస్పెండ్ చేసిన తర్వాతే తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. కేసీఆర్ వంటి సీఎం తనను గురించి ఇలా మాట్లాడటం బాధను కలిగించిందని, అలాంటి స్ధాయి నేత తనపై విమర్శలు చేసేముందు సమగ్ర సమాచారాన్ని తెప్పించుకొని విజ్ఞతతో మాట్లాడాలని విజయశాంతి కౌంటర్ ఇచ్చింది. రాములమ్మ విషయంలో కేసీఆర్ తప్పులో కాలేసి తన అజ్ఞాన్ని చాటుకున్నాడా? అంటే విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు. విజయశాంతి వెంటనే హడావుడి చేయకుండా సరైన సమయంలో, సరైన విధంగా కౌంటర్ ఇచ్చారని విశ్లేషకుల అభిప్రాయం. మరోసారి తనపై ఇలాంటి ఆరోపణలు చేయకుండా విజయశాంతి కౌంటర్ గట్టిగా ఉందని ఆమెను మెచ్చుకుంటున్నారు.