సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా రాధికాఆప్టే కీలకపాత్రలో రియలిస్టిక్ చిత్రాల దర్శకుడు రంజిత్‌పా దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం 'కబాలి'. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తమిళ సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ టీజర్ ఆన్‌లైన్‌లో ఓ ఊపు ఊపుతోంది. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 'నేను వచ్చానని చెప్పు... కబాలి తిరిగి వచ్చాడని చెప్పు' అంటూ రజనీ పలికిన డైలాగ్ అదిరిపోయింది. సంతోష్‌నారాయణ్ అందించిన 'నిరుప్పుడా...' సాంగ్ టీజర్‌లో రజనీ అద్భుతం అనిపించి అదరహో అని అదరగొట్టాడు. దాంతో ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తున్న నిర్మాతలు, వారి బినామీ అయిన అల్లుఅరవింద్‌ల ఆనందానికి హద్దే లేకుండా పోయిందని సమాచారం. సాంగ్ టీజరే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుంది? అనే అంచనాలు పెరిగిపోయి ఈ ఏడాదిలో వచ్చిన చిత్రాల్లో ఈ చిత్రం రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని, కలెక్షన్స్‌లో కొత్త శకానికి ఈ 'కబాలి' నాంది పలుకుతుందని అంటున్నారు. సాంగ్ టీజర్ విడుదలైన 10 నిమిషాల్లో లక్ష వ్యూస్ రావడం చూస్తే రజనీ స్టామినా ఏమిటో ఇట్టే అర్ధమైపోతోంది. 12 గంటల్లో 1మిలియన్ వ్యూస్‌ను ఈ చిత్రం సాధించింది. మొత్తానికి ఈ చిత్రం సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు. ఈ చిత్రం జులై 15వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది.