ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు, నిర్దేశించిన లక్ష్యాలను సాధించే క్రమంలో వివిధ శాఖలకు చంద్రబాబు రేటింగ్ ఇచ్చుకున్నారు. ఈ రేటింగ్స్‌లో టూరిజం శాఖకు జీరో రేటింగ్ రావడం విశేషం. ఈ శాఖను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే పర్యవేక్షిస్తుండటం విశేషం. ఈ క్రమంలో టూరిజం శాఖ అనుకున్న నిర్దేశాలను సాధించకపోవడంతో ఈ శాఖకు జీరో రేటింగ్ వచ్చింది. ఏపీలోని కీలకమైన విద్యాశాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల తీరు పట్ల చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖను గంటా శ్రీనివాసరావు నిర్వహిస్తుండగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను ఉపముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణమూర్తి పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు శాఖలకు కూడా జీరో రేటింగ్ వచ్చింది. తొమ్మిది శాఖలకు చంద్రబాబు త్రీ స్టార్స్ రేటింగ్స్ ఇచ్చారు. కామినేని శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్న ఆరోగ్యశాఖ, నారాయణ నిర్వహిస్తున్న మున్సిపల్‌శాఖ, చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తున్న ఎనర్జీ శాఖలకు త్రీ స్టార్ రేటింగ్ వచ్చింది. అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఈ శాఖలు త్రీ స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప పర్యవేక్షిస్తున్న హోంశాఖ, దేవినేని ఉమ నిర్వహిస్తున్న భారీ నీటిపారుదల శాఖలకు టూ స్టార్ రేటింగ్ వచ్చింది. ఆర్ధికశాఖతోపాటు రెవిన్యూ శాఖలకు సింగిల్ స్టార్ రేటింగ్స్ వచ్చాయి.