మెగా డాటర్, మెగా ప్రిన్సెస్ అయిన నిహారిక నటించిన మొదటి చిత్రం 'ఒక్క మనసు' చిత్రం ఇంకా విడుదల కాలేదు. సెన్సార్ పూర్తి చేసుకొని సెన్సార్ వారి అభినందనలు పొందిన 'ఒక్క మనసు' చిత్రం ఈనెల 24న విడుదలకు సిద్దమవుతోంది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే ఆమెతో సినిమాలు చేయాలని పలువురు నిర్మాతలు, దర్శకులు క్యూ కడుతున్నారు. కానీ ఆమె తండ్రి మెగాబ్రదర్ నాగబాబు చెబుతున్న ప్రకారం.. నిహారిక తన మొదటి సినిమా విడుదయ్యే వరకు మరెవ్వరికీ డేట్స్ ఇవ్వలేదని, 'ఒక్క మనసు' విడుదల తర్వాతే ఆమె సినిమాల్లో నటించాలా? వద్దా? కంటిన్యూ చేయాలా? అనే నిర్ణయం తీసుకోనుంది తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఓ భారీ నిర్మాత ఆమె డేట్స్‌కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఆయనెవ్వరో కాదు.. మెగా ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్. బాలీవుడ్‌లో హిట్టయిన 'పీకూ' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని అరవింద్ భావిస్తున్నాడు. ఎప్పటినుంచో ఈ ప్రాజెక్ట్‌పై కన్నేసిన అరవింద్ ఆ ప్రాజెక్ట్‌ను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే ఉన్నాడు. దీపికా పడుకోనే, అమితాబ్‌బచ్చన్, ఇర్పాన్‌ఖాన్‌లు 'పీకూ' చిత్రంలో నటించారు. ఇందులో దీపికాపదుకొనే పాత్రను నిహారిక చేత చేయించాలని, అమితాబ్ పాత్రను వెంకటేష్ లేదా నాగార్జునలలో ఒకరిని ఒప్పించాలని భావిస్తున్నాడట. మరోపాత్రకు ఓ యంగ్ హీరోను సంప్రదిస్తున్నారని సమాచారం. నిజంగా ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే నిహారిక నక్క తోక తొక్కినట్లే.