సెన్సార్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి, ముంబాయి హైకోర్టు తీర్పుతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నఉడ్తా పంజాబ్ చిత్రానికి పెద్ద షాక్. ఆర్థికంగా పెద్ద దెబ్బపడింది. బుధవారం నాడే కొందరు ఈ సినిమా సెన్సార్ కాపీని ఆన్ లైన్ లో పెట్టేశారు. ఇది ఊహించని పరిణామం. దీనివల్ల శుక్రవారం విడుదలయ్యే ఈ సినిమా రెవెన్యూపై తీవ్ర ప్రభావం చూపుతుందని చిత్ర సంబంధికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైరసీ భూతం సినిమా విడుదలకు ముందే పంజా విప్పింది. ఇది సరికొత్త నేరం. సెన్సార్ కాపీని ఆన్ లైన్ లో పెట్టడం అంటే ఇది ఇంటిదొంగల పనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేదా సెన్సార్ కార్యాలయం నుండి బయటకు వచ్చి ఉంటుందనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఎవరు చేసినప్పటికీ పూడ్చుకోలేని నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
పైరసీని అరికట్టడానికి చిత్ర సంబంధికులు రంగంలోకి దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో విచిత్రమేమంటే ఉడ్తా పంజాబ్ సినిమా ఆన్ లైన్ లో పెట్టిన విషయాన్ని చాలా మంది నెటిజన్లు సమాచారాన్ని షేర్ చేస్తూ, మరింత నష్టాన్ని తెస్తున్నారు. విడుదలకు ముందే పైరసీని అరికట్టడానికి పరిశ్రమ నడుంబిగించాల్సిన సమయం ఆసన్నమైంది.
మత్తు పదార్థాల వల్ల యువత ఏ విధంగా నష్టపోతున్నదనే విషయాన్ని తెలియజెప్పే ఉడ్తా పంజాబ్ చిత్రానికి ఆన్ లైన్ ద్వారా నష్టం జరగడం గమనార్హం.