ఎమ్మెల్యేలు కావడానికి ఘనమైన వారసత్వం, ఆర్దికం బలం ఉండాల్సిన పనిలేదని, తాను చెప్పిన పద్దతులను పాటిస్తే ఇట్టే ఎమ్మేల్యేలు కావచ్చని జగన్ తన అనుచరగణానికి చెబుతున్నాడు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు నాయకులు అయ్యేందుకు తాను మార్గం చూపుతున్నానని ఆయన చెబుతున్నాడు. నియోజకవర్గం పరిధిలోని ప్రతి పంచాయతీలో వున్న ఊర్లలో రోజుకు నాలుగు గంటల చొప్పున ఐదు నెలల పాటు ప్రచారం చేస్తే విజయం మీ సొంతం అవుతుందని ఆయన తన నాయకులకు హితబోధ చేస్తున్నాడు. రాజకీయాల్లోకి రావాలని, తాము ఎమ్మేల్యేలు కావాలని కలలు కంటున్న వారు చాలా మంది ఉన్నారని, వారికి తాను సపోర్ట్ చేస్తానని ఆయన అంటున్నాడు. ఇంతవరకు జగన్ చెప్పింది బాగానే ఉంది. ఇది అనాదిగా రాజకీయాల్లో చెబుతున్న.... ప్రజలతో మమేకం కండి.. అనే నినాదమే. దీనికి సరికొత్త సొబగులు అద్దుతున్నాడు జగన్. అయితే అసలు సమస్య ఏమిటంటే.. మొదటిసారి ఎమ్మేల్యేలు అయ్యే వరకు ఈ పద్దతి బాగా పనిచేస్తుంది. కానీ ఒక్కసారి గెలిచి ఎమ్మేల్యే అయితే చాలు తాము దేవుళ్లమని, తమ గొప్పతనం చూసే జనాలు ఓట్లేశారని, తాము ఏమి చేసినా ఓటర్లు ఏమీ అనరు అనే ధీమా వచ్చేస్తుంది. దాంతో ఇక ఎమ్మెల్యేలుగా గెలిచిన మత్తులో సెటిల్‌మెంట్లు, కాంట్రాక్ట్‌లు, బినామీలు..ఇలా అన్నింటిలో రాటుదేలిపోయి ప్రజలను పక్కనపెట్టి అధికారం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో మునిగిపోతారు. అయినా జగన్ చెప్పిదంతా కరెక్టే... కానీ క్లారిటీనే కొద్దిగా మిస్ అవుతోందనిపిస్తోంది కదూ..! నిజమే... ఎమ్మేల్యే సీటుకు జగన్‌కు ముట్టజెప్పాల్సిన కోట్లు ముందుగా ఎక్కడి నుండి తేవాలనేదే అసలు ప్రశ్న....!