చంద్రబాబును ఇబ్బందుల్లో పెట్టేందుకు జరుగుతున్న కాపు ఉద్యమం అనేక మలుపులు తిరుగుతోంది. దీనికి దాసరి, చిరంజీవి సైతం మద్దతు ప్రకటించారు. పవన్ కల్యాణ్ వైఖరి ఏమిటనేది ఇంకా స్పష్టం కాలేదు. జనసేన అధినేతగా ఒక కులానికి మద్దతుగా నిలిస్తే ఎన్నికలవేళ ఇబ్బంది తప్పదు. అందుకే ఆచితూచి వ్యవహరించనున్నారు.
మరోవైపు అరెస్టు చేసినప్పటికీ ముద్రగడ పద్మనాభం దీక్ష సాగుతోంది. వైద్యానికి నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన ఆయన కోరుకుంటున్నారు. నిరహారదీక్ష ద్వారా తన డిమాండ్ సాధించవచ్చని ముద్రగడ భావిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు అంటున్నాయి. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నిమ్స్‌లో దీక్ష కొనసాగించారు. వైద్యానికి నిరాకరించారు. దాంతో కేంద్రంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చింది. అప్పటి హోమ్ మంత్రి చిదంబరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కేవలం కేసీఆర్ దీక్ష వల్లే ఇది జరిగిందని ఇటీవలే జై రాం రమేష్ సైతం తన తాజా పుస్తకంలో వెల్లడించారు. సరిగ్గా ఇదే ఫార్ములాను పాటించాల్సిందిగా ముద్రగడకు కాపు నేతలు సూచించినట్టు సమాచారం. అందుకే ఆయన మహా పట్టుదలతో ఉన్నారు. కేసీఆర్ దీక్ష వల్ల అప్పటి కేంద్ర ప్రభుత్వమే కదిలివచ్చింది, కాబట్టి చంద్రబాబు సైతం దిగివస్తారనేది కాపు నేతల నమ్మకం.
కానీ చంద్రబాబు రాజకీయంగా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ నేర్పుగా చక్రం తిప్పగల సమర్థుడు. అందుకే ముద్రగడపై ఎదురుదాడి చేయడానికి కాపు నేతలనే పావులుగా వాడుతున్నారు. బలవంతంగా అయినా సరే ముద్రగడ చేత దీక్ష విరమింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.