మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మనిషి చూడటానికి ఆజానుబాహుడే కాదు... ఆయన కంఠం కూడా గంభీరంగానే ఉంటుంది. మలయాళంలో ఆయనకు సూపర్‌స్టార్ ఇమేజ్ రావడానికి ఆయన కంచుకంఠం కూడా ఓ కారణం. కాగా ఆయన ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'జనతాగ్యారేజ్' కాగా, రెండోది చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న'మనమంతా' చిత్రం. ఈ రెండు చిత్రాలలోని తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని మోహన్‌లాల్ పట్టుపడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి నిజమైన నటుడు అనే వాడు నటనకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో... వాచికానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాడు. మోహన్‌లాల్ సహచరుడైన మమ్ముట్టి తెలుగులో కె.విశ్వనాద్ దర్శకత్వంలో నటించిన 'స్వాతికిరణం' వంటి చిత్రానికి కూడా తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇప్పుడు అదే చేస్తానంటున్నాడు మోహన్‌లాల్. కానీ ఆ వాయిస్ తెలుగుప్రేక్షకులకు, శ్రోతలకి నచ్చకపోతే అసలుకే ప్రమాదం వస్తుందేమో అనే భయంతో ఈ రెండు చిత్రాల యూనిట్‌లు ఉన్నట్లు సమాచారం.