రాష్ట్ర బిజెపి నేతల తీరు మారడం లేదు. మిత్రధర్మాన్ని పక్కనపెట్టి తెలుగుదేశం విషయంలో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరులోనే బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారు. నిన్నటివరకు ప్రత్యేకహోదా, కేంద్రం నిధుల విషయంలో రెచ్చిపోయి మాట్లాడిన రాష్ట్ర బిజెపి నేతలు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలోనూ అదే దారిలో నడుస్తున్నారు. నాలుగైదు రోజుల కిందట బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ముద్రగడను పరామర్శించి టిడిపికి ఝులక్ ఇచ్చాడు. ముద్రగడ దీక్ష సమంజసమేనని ఒత్తాసు పలికాడు. ఇప్పుడు మరో బిజెపినేత కూడా అదే పని చేశాడు. ఏపీ బిజెపి జనరల్ సెక్రటరీ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ముద్రగడ దీక్ష సమంజసమే. టిడిపి ఇచ్చిన హామీలనే ముద్రగడ కోరుతున్నారు. ఆయన పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరం అంటూ మాట్లాడాడు. మరి బిజెపి.. టిడిపికి మిత్రపక్షం. బిజెపి మంత్రులు కూడా చంద్రబాబు కేబినెట్‌లో ఉన్నారు. చంద్రబాబు తీసుకున్నది మంత్రివర్గ నిర్ణయం. అలాంటప్పుడు చంద్రబాబు చేసే ప్రతిపనికి బిజెపి నాయకుల బాధ్యత, ఆ పార్టీకి చెందిన మంత్రుల సమిష్టి బాధ్యత ఉంటుందని బిజెపి నాయకులకు తెలియకపోవడం దురదృష్టకరం. ఇక సురేష్ రెడ్డి అయితే మరింత ముందుకేసి రాజధానికి సచివాలయ ఉద్యోగులు, శాఖాధిపతులు రావడానికి డెడ్‌లైన్ విధించడం అమానుష్యమని వ్యాఖ్యానించాడు. అంతేకాదు.. ఇటీవల సచివాలయ ఉద్యోగులు బిజెపి నేత పురందేశ్వరిని కలుసుకొని చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని కోరిన సంగతి తెలిసిందే. ఇలా ఉద్యోగులు బిజెపి నేతల ద్వారా ఉద్యోగుల తరలింపు విషయాన్ని రాజకీయం చేయడం పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.