సాధారణంగా మనం చేసే ఓ ఉద్యోగం నుండి వారం రోజులో, పది రోజులో బ్రేక్ తీసుకుని అటు తరువాత మళ్ళీ అదే సీట్ మీదకి వెళ్లి అదే పని చేయమంటేనే కాస్తంత బద్ధకంతో కూడిన ఇబ్బంది పడతాం. అలాంటిది కెమెరా ముందుకు రాకుండా, ముఖానికి మేకప్పే వేసుకోకుండా నటుడిగా సుమారు పదేళ్ళు బ్రేక్ తీసుకున్న చిరంజీవి మళ్ళీ షూటింగులకి వెళ్లి, పాత మెగా స్టార్ లాగా చిందులు వేయగలడా, సంభాషణలు పలకగలడా అన్న డౌట్ 150వ చిత్రం కత్తిలాంటోడు అనౌన్స్ చేసినప్పుడు అందరిలోనూ కలిగింది. స్క్రిప్ట్ విషయంలో నానా తర్జనభర్జనలు పడిన తదనంతరం కత్తిలాంటోడు ఇదిగో సెట్స్ మీదకి చేరింది. కానీ చిరంజీవి ఎంతవరకు పాత్రకి న్యాయం చేయగలడు, వయసు పైబడడంతో ముఖ్యంగా డ్యాన్సులు రక్తి కట్టించగలడా అన్న అనుమానాన్ని పటాపంచలు చేస్తూ సినిమా అవార్డ్స్ వేడుకలో రఫ్ఫాడించాడు. తన పాత చిత్రాల్లోని సూపర్ హిట్టు పాటలకు, అవే స్టెప్పులను అలవోకగా వేస్తూ ఆడిటోరియం మొత్తం మైమరిచిపోయి, ఇది కదా మా మెగా స్టార్ నుండి కోరుకునేది అని అభిమానులు పులకించేలా నర్తించారు. ఏజ్ పెరిగిందే కాని తనలోని ఎనర్జీ, గ్రేస్ తగ్గలేదని, డ్యాన్స్ మాస్టర్లకు సవాల్ విసిరాడు. కత్తిలాంటోడుకు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాస్ ట్యూన్లు కట్టినా సరే క్లాస్ ట్యూన్లు కట్టినా సరే, కొరియోగ్రాఫర్లు ఎంతటి కష్టతరమైన స్టెప్స్ కంపోజ్ చేసినా సరే... మెగా స్టార్ ఈజ్ రెడీ అనేలా ఉంది నిన్నటి స్టేజీ షో.