తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత ఆయనకు ఎదురేలేకుండా పోయింది. ఆడింది ఆటా...పాడింది పాటగా ఆయన పాలన కొనసాగుతోంది. ఇక విపక్షాల స్వరం కూడా వినిపించకుండా ఆయన వైసీపీ, టిడిపిల దుకాణం బంద్ చేయించారు. ఇక మిగిలింది కాంగ్రెస్. ఆ పార్టీ తీరు ఎవ్వరికీ అర్ధం కాదు. వారిని ఎవరో వచ్చి కొంపముంచాల్సిన పనిలేదు. వారికి వారే గోతులు తీసుకోవడంలో వారెప్పుడు ముందుంటారు. ఇక కేసీఆర్ కూడా కాంగ్రెస్‌ను కూడా చాపచుట్టేయడానికి తనవంతు కృషి చేస్తూనే ఉన్నాడు. దీంతో కేసీఆర్ రెండేళ్ల పాలన సాఫీగానే సాగిపోయింది. కానీ ఆయనకు అనుకోని రూపంలో కోదండరాం నుండి విపత్తు ఎదురైంది. జెఏసీ చైర్మన్‌గా కోదండరాం మాటలకు తెలంగాణ ప్రజల్లో మంచి విలువ ఉంది. అంతటి గుడ్‌విల్ ఉన్న నేత తమను టార్గెట్ చేస్తుండటంతో అవాక్కవ్వడం టిఆర్‌ఎస్ వంతైంది. ప్రతిపక్ష పాత్ర తీసుకున్న కోదండరాం కేసీఆర్ పాలనపై తనదైన వ్యాఖ్యలతో ప్రజల్లో ఒకరకమైన చర్చ తేవడంలో సఫలీకృతుడైనాడు. ఇది ఆయన సాధించిన తొలి విజయంగా చెప్పవచ్చు. ఇలా కోదండరాం కేసీఆర్‌కు పక్కలో బల్లెంలా మారాడు.
ఇక ఏపీకి వస్తే సమస్యలను ఎదుర్కోవడం అలవాటైపోయిన చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం చుక్కలు చూపిస్తున్నాడు. కాపు నాయకుల మద్దతే కాదు.. మిగిలిన ప్రతిపక్షపార్టీల నాయకుల మద్దతును కూడా ఆయన సొంతం చేసుకుంటున్నాడు. ఆమరణ దీక్షను ఆయుధంగా చేసుకొంటున్నాడు. దీంతో ఆయన్ను ఎలా దారికి తేవాలో బాబుకు అర్దం కావడం లేదు. ఆయనకు ఏమైనా అయితే రాష్ట్రం భగ్గుమంటుదన్న విషయం బాబుకు బాగానే తెలుసు. అందులో గతంలో వంగవీటి మోహనరంగ సమయంలో ఎన్టీఆర్ ఎదుర్కొన్న ఇబ్బందులను స్వయంగా వీక్షించిన అనుభవం బాబుకు ఉంది. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు తలొక్కరు పక్కలో బల్లెలుగా మారారు.