ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఏదో ఒక సమస్యతో ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లు ఉంది సీఎం చంద్రబాబు పరిస్థితి. ఒకటి తీరింది అనగానే రెండో సమస్య కాచుకొని కూర్చొంటోంది. ప్రస్తుతం చంద్రబాబుకు కాపునేత ముద్రగడ పద్మనాభం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఈ విషయంలో కరవమంటే కప్పకు కోపం... వదలమంటే పాముకు కోపంలాగా ఉంది చంద్రబాబు పరిస్థితి. ముందు నుయ్యి వెనుక గొయ్యి తరహాలో ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్నాడు. పోనీ మంచి సలహాలు ఇచ్చి, పరిస్థితిని గట్టెక్కించే సీనియర్లు, వ్యూహకర్తలు ఉన్నారా? అంటే అదీ లేదు. అంతా భజన బృందమే. ఎవ్వరికీ దేనిపై అవగాహన లేదు. నారాయణ, చినరాజప్ప వంటి రాజకీయ ఓనమాలు తెలియని వారితో తన మంత్రివర్గాన్ని నింపేశాడు. సీనియర్లు, మంచి మంచి సలహాలు ఇచ్చేవారు, వ్యూహకర్తలకు పెద్దపీట వేస్తే తనకు, తన చినబాబుకు ఎసరు తెస్తారనే భయం చంద్రబాబుది. ఆయనలో అభద్రతా భావం ఎక్కువ. ఎవ్వరినీ నమ్మడు. దాంతో సమస్యలు జఠిలం అవుతున్నాయే గానీ శాశ్వత పరిష్కారం కావడం లేదు. పోనీ మంచి అధికార గణమైనా ఉందా? అంటే అదీ లేదు. చినబాబు పుణ్యమా అని అన్ని పోస్టులకు రేట్లు, కులపిచ్చితో అనర్హులకు అందలం తప్ప ప్రతిభకు చోటు లేదు. మరి ఇలాంటి పరిస్దితులు ఎదుర్కొవాలంటే ఆయన దగ్గర మంచి టీమ్ లేదు. బాబు అలాంటి టీమ్‌ను తయారుచేసుకోలేకపోయాడు. ఇది ఆయన స్వయంకృతాపరాధమే అని చెప్పాలి. మొత్తానికి బాబు.. ఏపీని ఈ మిగిలిన మూడేళ్లు ఎలా ఈది ఒడ్డున పడేస్తాడో చూడాలి మరి...!