యాక్షన్ హీరో గోపీచంద్ జన్మదినం మీడియా వారికైతే యమా ఆనందాన్ని కలిగించింది. మొదటిసారిగా గోపీచంద్, సినిమా పాత్రికేయులతో పార్టీ సెలబ్రేట్ చేసుకొని పేరుపేరునా పలకరించి అందరికీ దగ్గరివాడయ్యాడు. ఈ మీడియా మిత్రుల పేర్లు ఎలా ఉన్నా, గోపి నుండి రానున్న కొత్త చిత్రం ఆక్సిజన్ టైటిల్ మాత్రం తేడా కొట్టేసింది అంటున్నారు కొద్దిమంది ప్రేక్షకులు. ఆక్సిజన్ అనేది ఓ రసాయన శాస్త్రానికి సంబంధించిన నామధేయం, కామన్ ఆడియెన్సుకి బాగా కనెక్ట్ అయ్యే పదం. అలాంటి టైటిల్ చెవిన పడగానే ఇదేదో సైంటిఫిక్ థ్రిల్లర్ ఛాయలు ఉన్న చిత్రంగా అభివర్ణించడం కామన్ సెన్స్. దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్న పోస్టర్లు చూస్తుంటే, ఆ పేరుకి ఈ పోస్టర్లకి ఏమైనా కనీస సంబంధం ఉందా అన్న అనుమానం మొదలయింది. రూరల్ బ్యాక్ డ్రాపులో జరిగే యాక్షన్ థీమ్ ఈ చిత్రాల్లో ప్రస్ఫుటంగా అగుపిస్తోంది. గోపి పంచెకట్టు ముచ్చటగా ఉన్నా, ఇవన్ని ఎంతవరకు సినిమా పేరుకి జస్టిఫికేషన్ ఇవ్వగలుగుతాయి అన్న ప్రాథమిక కథా, కథనాల బలాల మీద దర్శకుడు జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ మీదే బాక్సాఫీస్ ఫలితం ఆధారపడుతుంది.