తెలంగాణలో టివి9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెళ్ల ప్రసారాలను నిలిపి వేసిన సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆ వివాదం తమకు అంటుకోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అది కేసీఆర్ అభీష్టం మేరకే జరిగిందని అందరికీ అర్ధమవుతున్నా కూడా అది ఎమ్మెస్‌వోల నిర్ణయం అని తప్పును వారిపై వేసింది. కానీ ఆ పాటి తెలివితేటలు కూడా ఆంద్రా మంత్రులకు లేవనే విషయం ఇప్పుడు సాక్షి చానెల్ ప్రసారాల నిలిపివేత విషయంలో నిజమైంది. సాక్షి ప్రసారాలను ప్రభుత్వమే ఆపివేసిందని మన మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు, చినరాజప్పలు మీడియా ముందే చెప్పారు. దీంతో ఇంతకాలం మీడియా స్వేచ్చ గురించి మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వానికి తిప్పలు తప్పడం లేదు. కనీసం ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలియని మంత్రుల తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. ఇక్కడ కూడా సాక్షి ప్రసారాల నిలిపివేతను ఎమ్మెస్వోల నిర్ణయంగా చెప్పి తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్‌కు ఉన్నటువంటి ముందస్తు తెలివితేటలు టిడిపికి, చంద్రబాబుకు లేకుండా పోయాయనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి టిడిపి ప్రభుత్వం అన్ని మీడియాలతో స్నేహపూర్వకంగా ఉన్నట్లే కనిపిస్తుంది. లోపల ఎన్ని చేసినా మీడియాకు గౌరవం ఇస్తున్నట్లుగానే నటిస్తుంది. అలాంటి టిడిపికి ఇకపై మీడియా స్వేచ్చపై మాట్లాడే నైతిక హక్కు లేకుండా పోయిందనే చెప్పవచ్చు.