జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మౌనం ఇతర పార్టీల నాయకులకు అసహనం కలిగిస్తోంది. ఏదో ఒక వివాదంలో పవన్ నోరు విప్పి చంద్రబాబుకు వ్యతిరేకంగా కామెంట్లు చేయందే వారికి నిద్ర పట్టేది లేదు. పవన్ చేసే కామెంట్స్ వల్ల తమ పార్టీకి ప్రయోజనమా? లేక నష్టమా? అనే విషయాన్ని పక్కనపెడితే ముందు పవన్ నోటి వెంట ఏదో ఒక కామెంట్ రావాలని వారు కోరుకుంటున్నారు. మొన్న వి.హన్మంతరావు, నిన్న అంబటి రాంబాబు.. ఇలా అందరూ పవన్‌ను పలు సమస్యల పట్ల స్పందించాలని తపన పడిపోతున్నారు. ముద్రగడ పద్మనాభం, తుని ఘటన, భగ్నమైన నిరాహార దీక్ష, సాక్షి ప్రసారాల నిలిపివేత, కాపులకు రిజర్వేషన్లు, ప్రత్యేకహోదా... ఇలా ఏదో ఒక విషయంలో పవన్ స్పందించాలని చాలా కాలంగా ప్రతిపక్షాలు తెగ ఉవ్విళ్లూరుతున్నాయి. కానీ పవన్ సమయం వచ్చేంతవరకు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్న దరిమిలా ప్రతిపక్షాల్లో మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులకు పాలుపోవడం లేదు. దీంతో వారు పవన్‌పై విషం కక్కుతున్నారు. పార్టీ పెట్టడానికి పవన్ వద్ద డబ్బులు లేకపోవచ్చు గానీ చంద్రబాబును ప్రశ్నించడానికి డబ్బులు అవసరం లేదు కదా..! అంటూ విమర్శలు చేస్తున్నారు. పనిలో పనిగా పవన్ సమస్యలపైన పోరాడకపోయినా ఫర్వాలేదని, కనీసం పోరాడే వారికి మద్దత్తు అయినా ఇవ్వాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు. మొత్తం మీద పవన్‌ను చంద్రబాబుపై ఎలాగైనా పురికొల్పి ప్రయోజనం పొందాలని ప్రతిపక్షనాయకులు నానా తంటాలు పడుతున్నారు అనేది వాస్తవం.