నేటిరోజుల్లో మీడియా విశ్వసనీయత కోల్పొయింది అనేది జగమెరిగిన సత్యం. అన్ని యిజాలలోకి అంటే టెర్రరిజం, నక్సలిజం, మ్యూనిజం... ఇలా ఉన్న యిజాలన్నింటిలోకి పూర్తిగా విలువలను కోల్పోతున్న యిజం 'జర్నలిజం'. స్వర్గీయ ఎన్టీఆర్‌కు, చంద్రబాబుకు తద్వారా టిడిపికి ఈనాడు పత్రిక పెద్ద పీట వేయడం నుండి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విషబీజానికి నాంది పలికాయని చెప్పకతప్పదు. ఆతర్వాత దాసరి 'ఉదయం' పత్రిక దీనికి మరింత ఆజ్యం పోసింది. ఇక వైఎస్ హయాం నుండి ఇది వెర్రితలలు వేసింది. ఆ రెండు పత్రికలు అంటూ చీటికిమాటికి వైఎస్ ప్రదర్శించిన అసహన దోరణి దీనికి ఆజ్యం పోసి, ఈ రెండు పత్రికల కారణంగానే తన కొడుకు జగన్ చేత సాక్షి పత్రికను పెట్టిస్తున్నానని వైఎస్ బహిరంగంగా చెప్పే దాకా ఈ విషసంస్కృతి వృక్షంలా పెరుగుతూ వచ్చింది. ఇక సాక్షి తర్వాత జరిగిన పరిణామాలు, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాలు పెరిగిన తర్వాత ఇది మరింత పెరిగింది. తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజాప్రతినిధులను అవహేళన చేశారనే కారణంగా ఎమ్మెస్‌ఓలు తెలంగాణలో టివి9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్స్‌పై నిషేధం విదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆజ్ఞలేనిదె ఇది జరిగే పని కాదని అందరికీ తెలుసు. తాజాగా ఏపీలో ప్రతిపక్షనేత జగన్‌కు చెందిన సాక్షి చానెల్ ప్రసారాలను ఆపివేశారు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అని మంత్రి గంటా శ్రీనివాసరావు చెబుతున్నారు. అసత్య, రెచ్చగొట్టే వార్తలను ప్రసారం చేస్తూ సమాజంలో ఉద్రిక్తతలకు సాక్షి చానెల్ ప్రయత్నిస్తోందనేది మంత్రి వాదన. వాస్తవానికి ఇప్పుడు ఉన్న మీడియా మొత్తం ఏదో ఒక పార్టీ అండదండలతోనే మనుగడ సాగిస్తూ, ఆయా పార్టీలకు భజన చేస్తున్నాయన్న విషయం తెలిసిందే. అయినా ప్రజలు అమాయకులు కాదు. వీరు ఏదో ఒక పత్రికను, లేదా చానెల్‌ను చూసి ఓ నిర్ణయానికి రావడం లేదు. రెండు మూడు పత్రికలు, చానెల్స్‌ను చూసి వారికి వారుగా వాస్తవాన్ని బేరీజు వేసుకుంటున్నారు. మొత్తానికి మీడియా విశృంకత్వం, విశ్వసనీయత రోజురోజుకూ దిగజారుతున్నా కూడా వాటి మానానికి వాటిని వదిలేసి, ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ప్రజలకే ఇవ్వాలి...! అంతేకానీ మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే అది మరింత విశృంఖలంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.