హీరో గోపీచంద్ తనకు కెరీర్‌లో మంచి హిట్టిచ్చిన దర్శకులకు మరలా మరలా చాన్స్‌లు ఇస్తుంటాడు. కొత్త డైరెక్టర్లని పెద్దగా నమ్మని ఈ హీరో తాను పనిచేసిన వారితోనే మరలా రిపీట్ కాంబినేషన్స్ సెట్ చేయడంపై ఆసక్తి చూపిస్తుంటాడు. ప్రస్తుతం ఆయన ఎ.యం.రత్నం నిర్మాణంలో ఆయన తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా చిత్రం 'ఆక్సిజన్'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత గోపీ మరోసారి శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక గోపీ కెరీర్‌లో 'ఆంధ్రుడు' చిత్రం మంచి హిట్టుగా నిలిచింది. ఈ చిత్రం తొలినాళ్లలో గోపీ కెరీర్ స్ధిరపడటానికి ఎంతో దోహదపడింది. ఆ తర్వాత 'ఆంధ్రుడు' డైరెక్టర్ పరుచూరి మురళికి మరలా కాలం కలిసి రాలేదు. ఆయన బాలకృష్ణతో చేసిన 'అధినాయకుడు' కూడా ఫ్లాప్ అయింది. దీంతో పరుచూరి మురళి సినీ కెరీర్‌లో ప్రమాదంలో పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గోపీచంద్ ఎంతో ఉదారంతో పరుచూరి మురళిని గుర్తుపెట్టుకొని ఆయనకు ఓ అవకాశం ఇచ్చాడని తెలుస్తోంది. ఈ చిత్రం స్టోరీ కూడా ఫైనల్ అయిందని సమాచారం. శ్రీవాస్ దర్శకత్వంలో చేయబోయే చిత్రం పూర్తయిన తర్వాత గోపీచంద్ - పరుచూరి మురళిల చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.