మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే స్టార్ హీరోలు కూడా ఎగిరిగంతేస్తారు. ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి ఎనలేని ఉత్సాహం చూపుతారు. ఆయన సినిమా అంటే కథ కూడా వినకుండా, తమ క్యారెక్టర్ ఏమిటో తెలుసుకోకుండా కూడా కాల్షీట్స్ ఇవ్వడానికి మన స్టార్ హీరోలు రెడీగా ఉంటారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం తన కెరీర్‌లో ఇప్పటివరకు చాలా తక్కువ మంది హీరోలతోనే పనిచేశాడు. ఇక ఆయన పనిచేసిన యంగ్ హీరోల్లో తరుణ్ తప్ప అందరూ స్టార్‌హీరోలే. కానీ తాజాగా ఆయన నితిన్ వంటి యంగ్ హీరోతో 'అ..ఆ' చిత్రం చేసి నితిన్‌కు, సమంతకు తిరుగులేని విజయం అందించాడు. దాంతో ఈతరం యువహీరోలతో పాటు ఇప్పటివరకు త్రివిక్రమ్‌తో కలిసి పనిచేసే అవకాశం రాని స్టార్‌హీరోలు కూడా నితిన్‌కు పట్టిన అదృష్టాన్ని చూసి ఈర్ష్యపడుతున్నారు. భవిష్యత్తులో నితిన్‌కు దక్కిన అదృష్టం తమకు ఎప్పుడు పడుతుందా? అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి త్రివిక్రమ్ ఆ హీరోల మొరను ఆలకిస్తాడో? లేక తనకు నచ్చిన పవన్, మహేష్, బన్నీ.. వంటి హీరోలతోనే కలిసి నడుస్తాడో వేచిచూడాల్సివుంది...!