రజనీ ప్రస్తుతం యుఎస్‌లో ఉన్నాడు. అక్కడ ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన ఆరోగ్యకారణాల రీత్యా ఆసుపత్రిలో లేడు. 'రోబో 2.0' కి సంబంధించిన ఓ గెటప్‌కు చెందిన మేకప్ టెస్ట్ కోసం ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు.ఆయనకున్న వయసు, ఆర్యోగ కారణాల రీత్యా ఆ గెటప్ ఆయనకు సరిగా సూట్ అవుతుందా? లేదా ఏమైనా అనారోగ్యకారణాలకు, ఇన్‌ఫెక్షన్స్‌కు కారణం అవుతుందా? అనే అనుమానంతోనే ఆయన్ను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి మేకప్ టెస్ట్ చేస్తున్నారు. ఇక ఆయన తాజాగా కలైపులి థాను నిర్మాణంలో రంజిత్ పా దర్శకత్వంలో 'కబాలి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జులై 1న విడుదల చేయాలని, ఆడియోను ఈనెల 12న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని భావించారు. కానీ రజనీ అమెరికాలో ఆసుపత్రిలో ఉండటంతో ఈ ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేయాలని నిర్మాతతో పాటు యూనిట్ భావిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్‌తో పాటు ఒకే ఒక్క టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆ ఒకే ఒక్క టీజరే చిత్రంపై ఉన్న అంచనాలను విపరీతంగా పెంచివేసింది. ఆడియో వేడుకలో తమ అభిమాన హీరోను చూద్దామని, అలాగే ఆడియో వేడుకతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతాయని రజనీ అభిమానులు ఎంతో ఆశపడ్డారు. కానీ ఇప్పుడు ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తుండటంతో వారు చాలా నిరాశచెందుతున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, మలయాళం, మలై (మలేషియా), జపనీస్ భాషల్లో ఇప్పటికే 200కోట్లకు పైగా బిజినెస్ చేసింది. తమ హీరో చిత్రంలో భారీ యుద్దాలు, సెటప్‌లు, గెటప్పులు, గ్రాఫిక్స్ లేకపోయినా కేవలం తమ హీరో మీద ఉన్న క్రేజ్‌తోనే ఈ చిత్రం అంత బిజినెస్ చేసిందని, అలా చూసుకుంటే 'బాహుబలి'తో పోల్చుకుంటే తమ చిత్రమే గ్రేటని రజనీ అభిమానులు వాదిస్తున్నారు. అది నిజమే కావచ్చు. కానీ అనవసరంగా 'కబాలి'కి, 'బాహుబలి'కి పోటీ పెట్టడం ఏమిటని మరికొందరు వాదిస్తున్నారు.