బాలకృష్ణ పుట్టిన రోజంటే అభిమానులకు పండగ రోజే. అందుకే నందమూరి ఫ్యాన్స్ మొత్తం ఈ ఏడాది అంటే రేపు జరగబోయే బాలకృష్ణ బర్త్ డే వేడుకలని ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఇక ఈ ఆనందానికి బాలయ్య బాబు నూరవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ప్రీ లుక్ కూడా జత కలిస్తే వారి సంబరానికి అవధులు ఉండవన్న విషయం అందరికన్నా ముందుగా సినిమా దర్శకుడు క్రిష్ గుర్తుంచుకున్నాడు. అందుకే వేటగాడు గురి చూసి బాణం వదిలినట్టుగా క్రిష్ కూడా సరిగ్గా బాలకృష్ణ పుట్టిన రోజుకి ఒక్క రోజు ముందు అంటే నేడు శాతకర్ణి ప్రీ లుక్ రిలీజ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ఓ రోజు ముందే సందడి షురూ చేసాడు. దేశం మొత్తం మీద ఇంకెవ్వరూ శాతకర్ణి పాత్రలో సరిపోరు అన్నట్లుగా ఉంది ఈ ప్రీ లుక్ అంటున్నారు ఫ్యాన్స్. సైడ్ యాంగిల్లో యుద్ధవీరుడి గెటప్పులో బాలయ్యని చూపించింది కొంచమే అయినా, మాకిది చాలు అన్నట్లుగా అభిమానులు రెచ్చిపోయారు. ఆ రాజసం, ఆ ఠీవీ మా నటసింహం సొంతం అంటూ తెగ మురిసిపోతున్నారు. శ్రీయ హీరోయిన్, దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కాగా రానున్న ఏడాది సంక్రాంతి బరిలో ఈ శాతకర్ణి దిగబోతున్నాడు.