మన మనసుకు నచ్చని వారి పేరును మనం ఉచ్చరించడానికి కూడా ఇష్టపడం. కానీ అనుకోని పరిస్థితుల్లో దగ్గుబాటి పురందేశ్వరికి బాబు నామస్మరణ చేయాల్సి వచ్చింది. మోదీ రెండేళ్ల పాలనపై బిజెపి వికాస్‌పర్వ్ పేరుతో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి స్మృతిఇరానీ విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో టిడిపి, బిజెపిలు మిత్రపక్షాలుకావడంతో తన ప్రసంగంలో ఆమె ప్రతి వాక్యంలోనూ చంద్రబాబు పేరును చేర్చి, ప్రధాని మోడీని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను కీర్తించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే మంత్రి స్మృతిఇరానీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించే బాధ్యతను పురందేశ్వరి తీసుకుంది. దీంతో మంత్రి ప్రతి వాక్యంలోనూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతుంటే ఆ ప్రసంగాన్ని అనువాదం చేస్తూ తాను కూడా అన్ని పార్లు చంద్రబాబు నామజపం చేయడానికి పురందేశ్వరి పడిన పాట్లు అక్కడి సభికులకు నవ్వును తెప్పించాయి. మొత్తానికి ఇరానీ పుణ్యమా అని చాలా కాలం తర్వాత మరలా పురందేశ్వరికి చంద్రబాబును కీర్తించే మహద్భాగ్యం కలిగిందని తెదేపా నేతలు అనుకోవడం విశేషం.