తెలుగులో దగ్గుబాటి రానా స్టైలే వేరు. కేవలం హీరో పాత్రలే చేయాలని, నెంబర్ గేమ్‌లో ముందుండాలి వంటి ఆలోచనలు లేని హీరో ఆయన. తన పాత్ర నచ్చితే హీరోనా, విలనా? అనేది కూడా చూసుకోడు. ఏ భాషా చిత్రమైనా నటించేస్తాడు. తాను విలన్ పాత్ర పోషిస్తున్నప్పటికీ హీరో ఎవరు? అని కూడా పట్టించుకోడు. అదే ఈ యువహీరో స్టైల్. ఇప్పటికే రానా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా వరుసపెట్టి నటిస్తున్నాడు. అయితే ఓ పంజాబీ చిత్రంపై రానా మనసు పారేసుకున్నాడు. గత సంవత్సరం పంజాబీలో విడుదలైన 'సర్దార్‌జీ' చిత్రం అక్కడ సూపర్‌హిట్ అయింది. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'సర్దార్‌జీ 2' చిత్రం రూపొందుతోంది. వాస్తవానికి ఈ చిత్రం రీమేక్ రైట్స్‌ను ఓ భారీ ప్రొడ్యూసర్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు. కానీ మధ్యలో రానా ఎంటర్ అయ్యాడు. ఈ చిత్రం మొదటి భాగం రైట్స్‌తో పాటు సీక్వెల్ రైట్స్‌ను కూడా తన తండ్రి చేత కొనిచ్చి, తెలుగులో చంద్రశేఖర్ యేలేటి లేదా నీలకంఠ వంటి క్లాస్ డైరెక్టర్ల చేతికి పగ్గాలు అప్పగించాలని రానా భావిస్తున్నాడు. ఇందులో హీరోపాత్ర డ్యూయల్ రోల్‌గా ఉంటుందని సమాచారం.