గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఉద్యోగులను హడలెత్తించాడు. వారికి కంటిలో కునుకు లేకుండా చేశాడు. ప్రభుత్వ ఉద్యోగుల్లో అలసత్వాన్ని వీడి, అవినీతిని కనిష్ట స్దాయికి తగ్గించాడు. అదే ఆయనకు తదుపరి ఎన్నికల్లో వరమైంది. ప్రజలందరూ బాబూ చర్యలను హర్షించి ఆయన పడుతున్న కష్టాన్ని చూసి ఎన్నికల్లో మరలా గెలిపించారు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు అద్బుతంగా ఉండటం ఉద్యోగులకు చెమటలు పట్టించింది. దాంతో తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఉద్యోగుల్లో చంద్రబాబు అంటే వ్యతిరేకత వచ్చింది. వారు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయడమే కాదు.. ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఓటమికి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గెలుపుకు తీవ్రంగా కృషి చేశారు. ఇక వైఎస్ హయాం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యోగులు ఆడింది ఆట పాడింది పాట.. ఉద్యోగాలకు ఎన్ని గంటలకు విధులకు హాజరవుతారో ఎవ్వరూ పట్టించుకోరు. లంచం ఇవ్వందే చిన్న పని కూడా ముందుకు కదలని పరిస్దితి. విచ్చలవిడితనం, విశృంఖలం వంటి పదాలు వాడినా తప్పులేదు. ఉద్యోగులదే హవా అయింది. దీంతో ఈసారి చంద్రబాబు ఉద్యోగులతో వైరం ఎందుకు అనుకున్నాడో ఏమో? ఆయన ఉద్యోగుల పట్ల చూసిచూడనట్లు వ్యవహిరిస్తున్నాడు. వైఎస్ హయాంలో కంటే పరిస్దితి మరింత దారుణంగా తయారైంది. ఉద్యోగుల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. లంచం తీసుకోవడం ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. గతంలో లంచం పబ్లిగ్గా తీసుకోవడానికి భయపడిన అధికారులు ఇప్పుడు పబ్లిగ్గా అడుగుతూ తీసుకుంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అలా చూస్తూనే ఉన్నాడు. ఆయన మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. కానీ క్షేత్ర స్దాయిలో చూస్తే విశృంఖలత్వం కనిపిస్తోంది. దీంతో ఎన్నో ఆశలతో చంద్రబాబును గెలిపించుకున్న ప్రజలు ఇప్పుడు ఎవరికి తమ గోడు వినిపించుకోవాలో? కూడా తెలియక అన్నింటికీ సర్దుకుపోతున్నారు