రాజకీయ చిత్రాలను, పొలిటికల్ సెటైర్స్ చిత్రాలను తీయడంలో దాసరి నారాయణరావు స్టైలే వేరు. ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగిడే సయమంలో ప్రజల్లో చైతన్యం కలిగించి ఎన్టీఆర్ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా 'బొబ్బిలిపులి, సర్దార్‌పాపారాయుడు' వంటి చిత్రాలను తీసి తనదైన మార్క్‌ను నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ కూడా వచ్చే ఏడాది చివరి నాటికి రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించి ఓ రెండేళ్లు పార్టీని సంస్థాగతంగా బలపడేలా చేయాలని భావిస్తున్నారు. 2014ఎన్నికలలోనే ఆయన టిడిపి, బిజెపిలకు ప్రచారం చేసినప్పటికీ.. పవన్ ఇప్పటివరకు ఎక్కువగా అభిమానుల వరకే తన మనోభావాలను తీసుకొని వెళ్లారు. ఈ తరుణంలో సామాన్య ప్రజల వరకు తన భావజాలాన్ని తీసుకొని వెళ్లడానికి అనువుగా దాసరి నిర్మాణంలో రూపొందే ఓ చిత్రంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఎవరు అవునన్నా..కాదన్నా.. ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందనుందని సమాచారం. ఈ చిత్రం ఎలా ఉండాలో దాసరి ఇప్పటికే పవన్‌కు, త్రివిక్రమ్‌కు సూచించాడట. దానికి అనుగుణంగా జనాలు మెచ్చే కథను, డైలాగ్స్‌ను రాయడానికి త్రివిక్రమ్ సంసిద్దుడు అవుతున్నాడు. మొత్తానికి పవన్ పొలిటికల్ మైలేజీ కోసం అటు దాసరి మంత్రం వేస్తుండగా, త్రివిక్రమ్ తన తంత్రాన్ని చూపించనున్నాడు.