చిరును మోసం చేస్తే ప్రేక్షకులు తట్టుకోలేరు అంటున్నాడు టాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు. ఆయన ఇటీవల ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ... చిరంజీవి నటించిన 'డాడి' చిత్ర ప్రస్తావన తెచ్చారు. ఈ చిత్రం అద్భుతమైన కాన్సెప్ట్ అని, కానీ ఇందులో చిరంజీవి ఓ ఫ్రెండ్ చేతిలో మోసపోవడాన్ని ప్రేక్షకులు తట్టుకోలేకపోవడం వల్లనే ఆ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని దాంతో ఈ చిత్రం పెద్ద విజయం సాధించలేకపోయిందని చోటా అభిప్రాయపడ్డాడు. చిరంజీవి గారి కళ్లలో నీటిని, చిరంజీవి గారిని ఎవరో మోసం చేయడం అనే ఫీలింగ్‌ను కూడా ప్రేక్షకులు తట్టుకోలేరని చోటా గట్టిగా అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమాలలో స్టోరీ కంటే డ్యాన్స్‌లు, ఫైట్లు, పెర్ఫార్మెన్స్‌లే ముఖ్యం కావడానికి చిరంజీవే కారణం అయ్యారని ఆయన చెప్పుకొచ్చాడు. నిజమే.. చిరంజీవి టాప్ గేర్‌లో ఉన్న సమయంలో ఆయన నటించిన చిత్రాల్లో కథ కంటే డ్యాన్స్‌లు, ఫైట్స్ వంటివే ఎక్కువ ప్రాధాన్యం పొందాయి. ఆయన సినిమాల్లో ఏదో కొంచెం కథా బలం ఉన్నా చాలు అవి సూపర్‌హిట్స్‌గా నిలిచాయి అనేది వాస్తవం.