నిన్న చంద్రబాబునాయుడు.. నేడు జయలలిత... వీరిద్దరు ఎన్నికల్లో రైతుల రుణమాఫీతో పాటు లక్షల కోట్ల హామీలను ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చి విజయం సాధించారు. కానీ రాష్ట్ర ఆర్ధికపరిస్దితులు చూస్తే దారుణంగా ఉన్నాయి. దాంతో కేంద్రం ఛీ అన్నా, చా అన్నా సర్దుకుపోక తప్పని పరిస్దితుల్లో చంద్రబాబు కూరుకుపోయాడు. ఇప్పుడు అదే సమస్య జయలలితకు కూడా ఎదురవుతోంది. ఎన్నికల్లో ఆమె ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన్నా కేంద్రంలోని మోడీ సర్కార్ ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి. వాస్తవానికి కేంద్రంలోని మోడీ సర్కార్‌కు లోక్‌సభ సాక్షిగా తీసుకుంటే ఎవ్వరితో పొత్తు అవసరం లేదు. ఆయనకు పూర్తి మెజార్టీ ఉంది. కానీ రాజ్యసభలో మాత్రం ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదు. రాజ్యసభలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకే ఎక్కువ సీట్లు ఉన్నాయి. దీంతో కీలకమైన బిల్లులు ఆమోదం పొందకుండా ఉండిపోతున్నాయి. సో.. ఇప్పుడు మోడీకి జయలలిత అవసరం వచ్చింది. అటు లోక్‌సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ చెప్పుకోదగ్గ బలం ఉన్న అన్నాడీఎంకేను మోడీ ఎన్డీఏలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు హామీల అమలుకు, రాష్ట్రాభివృధ్దికి అమ్మకు కూడా కేంద్రంలోని మోడీ సర్కార్ దయాదాక్షిణ్యాలు అవసరం. సో.. త్వరలోనే ఎన్డీయే కూటిమిలోకి జయలలిత రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.