జెఎసి చైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు తెరాస ప్రభుత్వానికి వణుకు పుట్టించాయి. ఆయనపై ప్రత్యారోపణలు చేయడానికి మంత్రులు, ఎంపీలు పోటీపడ్డారు. కానీ ఆరోపణలకు సమాధానం చెప్పలేకపోయారు. కోదండరామ్ లేవనెత్తినవి సమంజసమైనవే. నిర్వాసితుల తరుపున మాట్లాడారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది.
రాజకీయ పార్టీలపై ప్రత్యర్థులు విమర్శలు చేయడం, దానికి స్పందనలు రావడం సహజంగా జరిగేదే. కానీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రధారి కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు తెరాసకు మింగుడుపడలేదు. ఆయన రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యక్తి కావడమే దీనికి కారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమంలో ఎలాంటి భూమిక పోషించని (శ్రీనివాసయాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, డి.శ్రీనివాస్) వంటి నేతలకు పదవులు దక్కాయి. జెఏసి చైర్మన్ హోదాలో ఉద్యమానికి పెద్దమనిషిగా ఉండి దిశ, దశ చూపించిన కోదండరామ్ ను మాత్రం కేసీఆర్ పక్కన పెట్టేశారు. ఉద్యమ సమయంలో కోదండరామ్ సేవలు ఉపయోగించుకుని, కేవలం తనను గౌరవించడం లేదనే సాకుతో పక్కన పెట్టేశారు. అయినప్పటికీ కోదండరామ్ మిన్నకున్నారు. తెరాస రెండేళ్ళ పరిపాలన చూశాక మాత్రం స్పందించక తప్పలేదు. ఆయన ప్రజల తరుపునే మాట్లాడారు తప్పా, వ్యక్తిగతంగా కాదనే విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోయింది. వ్యక్తిగత విమర్శలకు దిగింది.
కోదండరామ్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి కాక పుట్టించాయి. ఇవి భవిష్యత్తులో ప్రమాద ఘంటికలుగా మారతాయని గ్రహించే కోదండరామ్ వెనుక వేరొకరు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఐక్యంగా నడిపిన ఘనత కోదండరామ్ కు దక్కుతుంది. ఈ విషయాన్ని తెరాస మరిచింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమ సారధిని పక్కన పెట్టేసి, కేసీఆర్ కు రాష్ట్ర సాధన క్రెడిట్ మొత్తం తనకే చెందాలని భావిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ఫలాలు ఇవి కావని చెప్పడం ఆయనకు నచ్చలేదు. ప్రజాకర్షక పథకాల కంటే ప్రయోజనం చేకూర్చే పథకాలు ముఖ్యమని కేసీఆర్ గ్రహించలేకపోతున్నారు.
కోదండరామ్ రగిలించిన వేడి ప్రభుత్వానికి బాగానే తాకింది. వివరణ ఇవ్వడంతో పాటుగా సొంత పత్రిక 'నమస్తే తెలంగాణ'కు కోటి రూపాయల ప్రకటన విడుదల చేశారు. అందులో ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి వివరించారు. ఇది రాజకీయ ఉద్దేశంతో ఇచ్చిన ప్రకటన అని స్పష్టమవుతోంది. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది.