రాజ్యసభ ఎన్నికలు టిడిపిలో పెద్ద కలకలాన్నే సృష్టించాయి. టిడిపికి దక్కాల్సిన మూడు సీట్లలో ఒక సీటును మిత్రపక్షమైన బిజెపికి కేటాయించి తమకున్న రెండు సీట్లలో ఒకటి సుజనాచౌదరికి మరోసీటు కర్నూల్ జిల్లాకు చెందిన టి.జి.వెంకటేష్‌కు చంద్రబాబు కేటాయించారు. అయితే ఈ నిర్ణయంతో టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ రోడ్డెక్కారు. కర్నూల్‌లోని పార్టీ ఆఫీస్ ముందు తన అనుచరులతో ఆందోళనకు దిగిన ఆయన పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, కొత్తగా వచ్చిన వారికి పదవులు కేటాయించడంపై టిడిపిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాగైతే జిల్లాలో టిడిపిని భూస్దాపితం చేస్తానని, టిడిపిని కూకటివేళ్లతో పెకలిస్తానని ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు పార్టీలో బిసీలకు అన్యాయం జరుగుతోందని రెచ్చిపోయారు. ఇలా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలే తమ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడాన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. కేఈ ప్రభాకర్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు సమాచారం. దీనిపై ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. తెలుగుదేశం క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, పదవులు రాలేదని ఎవరికి వారు ఆందోళన చేసి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, అది తమ్ముడైనా, లేక కొడుకైనా తప్పదని హెచ్చరించారు. కేఈ ప్రభాకర్ తీరుపై చంద్రబాబు ఇప్పటికీ చాలా కోపంగా ఉన్నాడని సమాచారం. ఇప్పటికైనా కేఈ ప్రభాకర్ చంద్రబాబును కలిసి క్షమాపణ చెబితే మందలించి వదిలేస్తాడని, లేకపోతే పార్టీ నుండి సస్పెండ్ చేసే ఆలోచనలో ఆయన ఉన్నాడని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.