యద్దనపూడి సులోచనరాణి నవల ఆధారంగా 43 సంవత్సరాల క్రితం వచ్చిన చిత్రం మీనా. ఇదే చిత్రం ప్రేరణతో త్రివిక్రమ్ అ ఆ తీశారు. కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది. త్రివిక్రమ్ స్టైల్ కథనం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ విజయంతో దర్శకుల్లో ఒక భరోసా కలిగింది. కొత్త కథల కోసం వెతుక్కోవడం అంటే పాత సినిమాల కథలనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తే ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకం వారిలో ఏర్పడింది.
మీనా చాలా చాలా పాత కథ. అయినప్పటికీ కొత్త జనరేషన్ మెచ్చింది. అంటే కథలు అప్ డేట్ గా ఉండాలనే నిబంధన ఏదీ లేదన్నమాట. పాత సినిమాలను మళ్ళీ మళ్ళీ తీయడం తెలుగులో కొత్తకాదు. ఇది చాలా పాత ప్రక్రియ.
పండంటి కాపురం చిత్రం ప్రేరణతో అనేక చిత్రాలు వచ్చాయి. బొమ్మరిల్లు (పాతది), కుటుంబగౌరవం తీశారు. ఆ తర్వాత చిరంజీవి గ్యాంగ్ లీడర్ చిత్రానికి సైతం ఇదే ప్రేరణ.
ప్రేమాభిషేకం చిత్రాన్ని రివర్స్ చేసి శుభలగ్నం తీయగా, హీరో హీరోయిన్ కోసం అత్తింటికి చేరడం అనేది గుండమ్మకథ నుండి ఉన్నదే. శివ సినిమా ప్రభావం చాలా చిత్రాలపై ఉంది. రాముడు-భీముడు అనేక చిత్రాలకు ప్రేరణ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక చిత్రాలకు ఆధారాలు లభిస్తాయి.