రాజకీయాలు దిగజారుతున్నాయనే మాట చాలాకాలంగా వినిపిస్తున్నదే. రాజకీయాల్లో విలువలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. నేరస్తులు, ఆర్థిక నేరగాళ్ళకు రాజకీయాలు షెల్టర్ ఇస్తున్నాయి. ఇక ప్రత్యర్థిపై హుందాగా ఆరోపణలు చేయడం అనేది తెలుగు రాష్ట్రాల్లో అడుగంటిపోయింది. మాటల తూటాలు పేలుస్తున్నారు. జనం కూడా మాట్లాడుకోవడానికి వెనుకాడే మాటలు మాట్లాడుతున్నారు. ప్రత్యర్థిని మనసులో తిట్టుకునే మాటలు పబ్లిగ్గా అనేస్తున్నారు. నాయకులే సంయమనం కోల్పోతే కార్యకర్తల పరిస్థితి ఏమిటీ. దీనివల్ల తాత్కాలికంగా మైలేజ్ రావచ్చు, కానీ భవిష్యత్తులో అవే మాటలు తను కూడా పడాల్సి వస్తుందని నేతలు గ్రహించడం లేదు.
తాజాగా వైకాపా నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవి. ప్రజలను రెచ్చగొట్టడం, చెప్పులతో కొట్టండి, చీపుర్లు చూపించండి అని చెప్పడం ఆయనలో అసహనానికి పరాకాష్టగా విశ్లేషకులు భావిస్తున్నారు. తనకు దక్కాల్సిన ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబు తన్నుకుపోయారని ఆయన నిరంతం ఆవేశపడుతున్నారు. వైకాపా నుండి ఎమ్మెల్యేలు తెదేపాలోకి వలస వెళ్ళడం ఆయనలో మరింత అసహనాన్ని పెంచుతోంది. పోతున్నవారిని కట్టడి చేయలేక చేతులెత్తేశారు. మరికొందరు పోతారనే భయం ఉంది. అదే జరిగితే పార్టీ నిర్వీర్యం అవుతుందని, 2019లో క్యాడర్ లేకుండా పోతుందని ఆయన ఆందోళన. దీనికి చెక్ పెట్టాలంటే తను మారాలి. కానీ జరుగుతున్నది వేరు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది రాష్ట్రం వ్యాప్తంగా రాజకీయ వేడి రగిలించింది. వైకాపాలో ఉత్సాహాన్ని కలిగించినా, అదే స్థాయిలో స్తబ్దుగా ఉన్న తెదేపా కార్యకర్తల్ల కూడా కదలిక తెచ్చింది.
ఈ వేడి కొద్ది రోజుల్లోనే చల్లారుతుంది. కానీ జగన్ పై ప్రజల్లో ఏర్పడిన చులకన భావం మాత్రం పోదని వైకాపా శ్రేణులు గ్రహిస్తున్నట్టు లేదు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఆయన చేసిన, చేస్తున్న పనులపై రాబోయే ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారు. రాష్ట్ర అభివృద్దిని అడ్డుకుంటున్నాడని ప్రజలు భావించే స్థాయికి జగన్ కదలికలు ఉంటున్నాయి. నెలకోసారి ఏదో ఒక పేరు చెప్పి చేస్తున్న దీక్షలు, ధర్నాలు, భరోసా యాత్రలు తన మీడియాలో వేసుకోవడానికి పనికొస్తాయి కానీ, జగన్ కు భవిష్యత్తును ఇస్తాయా అనేది అనుమానమే. మరో మూడేళ్ళు ప్రభుత్వం ఉంటుంది. వాగ్దానాలు తీర్చడానికి ఇంకా సమయం ఉంది. అంతకంటే ముందు ఆర్థిక వనరులు లేక సతమతమవుతున్న రాష్ట్రం గురించి ఆలోచించాలి. ప్రజల్లో చైతన్యం తేవడం అంటే వారిని రెచ్చగొట్టడం సరికాదనే విషయాన్ని జగన్ గ్రహిస్తే మంచిది.