తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అయినప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్ ఎగరేసుకొని పోవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏమి చేయాలో పాలుబోవడం లేదు. ఈ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావులు త్వరలో గులాబి గూటికి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గుత్తా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పార్లమెంట్ కార్యదర్శుల విషయంలో ఆయన నానా యాగీ చేసి తన పంతం నెగ్గించుకున్నాడు. చివరకు ప్రభుత్వం పార్లమెంట్ కార్యదర్శులను తొలగించాల్సివచ్చింది. ఈ విషయంలో ఆయన హైకోర్టు దాకా వెళ్లారు. అయితే కొద్దిరోజుల నుంచి ఆయన వైఖరిలో మార్పు వస్తోంది. పోయిన నెల 19వ తేదీన మంత్రి హరీష్‌రావు నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ఆయన మంత్రి హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డిల కారుల్లోనే ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మారే సంగతి గురించి చర్చలు జరిగాయి. వాస్తవానికి ఇప్పటికే గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీ మారేవాడు. కానీ పార్టీ ఫిరాయింపు వల్ల తన ఎంపీ పదవిపై అనర్హత వేటు పడుతుందనే భయంతో ఆయన తర్జనభర్జనలు పడుతున్నాడు. రాజ్యసభ సీటు తనకిస్తే పార్టీ మారడానికి సిద్దమని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చెప్పారు.కానీ రాజ్యసభ పదవులు ఇతరులకు వెళ్లడంతో ఆయన కాస్త వెనకడుగు వేశారు. అయినా త్వరలో ఆయన గులాబీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈయనతో పాటు ఎమ్మెల్యే భాస్కర్‌రావు కూడా కారులో ఎక్కనున్నారని సమాచారం. మరోపక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా టిఆర్‌ఎస్‌లోకి జంప్ అవుతున్న నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో టిఆర్‌ఎస్‌ను బలంగా నిలిపే అంశంపై కేసీఆర్ దృష్టి సారించారు.