నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి హరీష్‌రావును కలిసిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ఇప్పటికైనా సర్జరీ చేయాలని లేకపోతే భవిష్యత్తులో పోస్ట్‌మార్టమ్ చేయాల్సిన పరిస్దితి ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత టిపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంతకు ముందు పనిచేసిన పీసీసీ అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కంటే అసమర్దుడని ఆయన ధ్వజమెత్తారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేతకాని తనం వల్లే పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలైందని, అదే తాను పిసిసీ చీఫ్‌ను అయివుంటే ఎన్నికల్లో పార్టీని గెలిపించడమో లేక పదవికి రాజీనామా చేయడమో చేసేవాడినని వ్యాఖ్యనించాడు. తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి భువనగిరి నియోజకవర్గం నుండి ఓడిపోవడానికి పీసీసీ చీఫ్ గ్రూప్ రాజకీయాలే కారణమని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక తెలంగాణలో గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఇప్పుడే అధిష్టానం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో రాష్ట్ర పరిస్దితిపై సోనియాకు లేఖ రాస్తానన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన 15, 20మంది సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తామే ముఖ్యమంత్రులమని కలలు కంటున్నారని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి కోమటిరెడ్డి వాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర సంచలనానికి తెరలేపాయి.