ఏపీకి ప్రత్యేకహొదా ఇప్పించేందుకు, ఇక్కడ రాష్ట్ర పరిస్థితిని, ప్రజల సెంటిమెంట్‌ను అధిష్టానానికి చెప్పి ఒప్పించాల్సింది పోయి కేవలం టిడిపిని టార్గెట్ చేసి, ప్రత్యేకహోదా అవసరం లేదు.. మా కేంద్రంలోని ప్రభుత్వం ఏపీకి ఎవ్వరికీ ఇవ్వనన్ని నిధులు ఇస్తోందంటూ.. ప్రత్యేకహోదా అంటే కేవలం 700కోట్లు మాత్రమే అని సెలవిచ్చిన బిజెపి ఫైర్‌బ్రాండ్ సోము వీర్రాజుకు ఏపీ బిజెపి అధ్యక్ష పదవిని ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిని కాకుండా, టిడిపికి మిత్ర పక్షంగానే ఉంటూ.. టిడిపిపై మాటల దాడి చేస్తోన్న సోము వీర్రాజు ప్రతిభకు అమిత్‌షా ముగ్ధుడైపోతున్నాడట. ఇదే జరిగితే ఇది చాలా దురదృష్టకర పరిణామంగా చెప్పుకోవాలి. అందులోనూ ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన సోమువీర్రాజును ఎంపిక చేస్తే వచ్చే ఎన్నికల నాటికి కాపుల ఓట్లనీ తమకే పడుతాయనే భ్రమలో బిజెపి అధిష్టానం ఉంది. అలాగే సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తే తన సామాజిక వర్గానికే చెందిన పవన్ ను.. వీర్రాజు వచ్చే ఎన్నికల నాటికి లైన్లో పెడతాడనే ఆలోచనలో అధిష్టానం ఉందని సమాచారం. అయినా అస్సోంలో గెలిచాము కదా! ఏపీ, తెలంగాణలలో ఎందుకు గెలవలేమని బిజెపి నాయకులు అత్యాశపడుతున్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రుల విశ్వరూపం ఏమిటో? బిజెపికి తెలిసోస్తుంది. ఇప్పడు సాధించిన సీట్లు కూడా కేవలం టిడిపి మద్దతుతో వచ్చినవే అని ఆ పార్టీ నాయకులకు త్వరలోనే తెలిసోస్తుంది. మోడీ వల్ల టిడిపి గెలిచిందా? లేక టిడిపి వల్ల బిజెపికి ఆ మాత్రం సీట్లయినా వచ్చాయా? అనే విషయం స్పష్టంగా వారికి అర్థమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.