ఒకప్పుడు క్లైమాక్స్ అంటే విలన్‌ను అంతం చేయడానికి హీరోలు చేసే వీరోచిత పోరాటాలు, యాక్షన్ సీక్వెన్స్‌లతో నిండిపోయేవి. కానీ ఇప్పుడిప్పుడే ఓ కామెడీ సీక్వెన్స్‌తో క్లైమాక్స్‌లో నవ్వులు పూయించి ప్రేక్షకులు నవ్వుకుంటూ థియేటర్లలో నుండి బయటకు వెళ్లేలా చేస్తున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన 'దుబాయ్ శ్రీను, దూకుడు' అదే తరహా కామెడీతో నిండిన సినిమాలే. ఇక 'రేసుగుర్రం'లో చివరి 15 నిమిషాలు కిల్‌బిల్‌పాండేగా బ్రహ్మానందం కామెడీ సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళింది. గోపీచంద్ 'లౌక్యం', సుధీర్‌బాబు 'భలే మంచిరోజు' లు కూడా ఇలానే నవ్వులు పూయించాయి. తాజాగా వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అ..ఆ'లో సైతం క్లైమాక్స్‌లో రావురమేష్ పాత్రను హైలైట్ చేశాడు త్రివిక్రమ్. మొత్తానికి క్లైమాక్స్‌లో కామెడీ పండించగలిగితే అదే సినిమా విజయానికి శ్రీరామరక్ష అవుతుందని దర్శనిర్మాతలు, హీరోలు కూడా భావిస్తున్నారు.