హైదరాబాద్‌లో సముద్రమేంటి... అందులో బాలయ్య ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? సినిమా మాయ అంటే అదేనండీ. ఎక్కడైనా ఏదైనా సృష్టించగల సత్తా సినిమా వాళ్లకే ఉంది. ఆ రకంగా ఇప్పుడు మన బాలయ్య కోసం హైదరాబాద్‌లోనూ సముద్రం సృష్టించారు. ఆ సముద్రంలోనే బాలయ్య భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. ఆయన చుట్టూ 200 పడవల్లో వెయ్యిమంది యోధులు కూడా ఉన్నారు. మరి బాలయ్యని విజయం వరించిందో లేదో తెలియాలంటే 'గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. శతాబ్దాలకిందటి శాతవాహనుల కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యం, దానికి తోడు గౌతమీపుత్ర శాతకర్ణిలాంటి చక్రవర్తి కథ కాబట్టి సినిమాని భారీ హంగులతో తెరకెక్కించాల్సి వస్తోంది. ఇందులో భీకరమైన యుద్ధ సన్నివేశాలు ఉంటాయట. వాటిని హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో తెరకెక్కిస్తున్నారు. ఆ యుద్ధం సముద్రంలో సాగుతుందట. నిజమైన సముద్రంలో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించాలంటే చాలా వ్యయప్రయాసాల్ని ఎదుర్కోవల్సి వుంటుంది. అందుకే క్రిష్ హైదరాబాద్‌లో ఓ సెట్ వేసి ఆ సన్నివేశాలు తీస్తున్నారు. షూటింగ్ పూర్తయ్యాక సీజీలో సముద్రాన్ని సృష్టించుకొంటారన్నమాట. 200 పడవలు, వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టుల నేపథ్యంలో తెరకెక్కుతున్న యుద్ధ సన్నివేశాల కోసం హాలీవుడ్‌కి చెందిన స్టంట్ కొరియోగ్రాఫర్స్, మన రామ్‌లక్ష్మణ్‌లు పని చేస్తున్నట్టు తెలుస్తోంది.