కేవలం రెండు సీట్లు ఉన్న బిజెపికి కేంద్రంలో మొదటి సారి అధికారంలోకి రావడానికి, ఆ పార్టీ ఈ స్థితికి చేరడానికి ఉపయోగపడిన మంత్రం అయోధ్యలోని రామాలయం, బాబ్రీమసీదు నినాదాలే. అయితే బాబ్రీ మసీదును పడగొట్టిన తర్వాత ఈ సమస్య ముగిసిపోయిందని అందరూ భావించారు. వాజ్‌పేయ్ నేతృత్వంలోని ఎన్డీయే మొదటి సారిగా అధికారంలోకి రావడానికి ఇది ఉపయోగపడింది. కానీ ఎప్పుడు అదే అంశాన్ని చెప్పి ఓట్లు అడిగితే రావని బిజెపి ఆలోచించింది. దాంతో 2014లో మోదీ అభివృద్ది మంత్రాన్ని పార్టీ ప్రధానాంశంగా ఎంచుకుంది. అయితే బిజెపిలోని ఓ వర్గం నాయకులు మాత్రం రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మరలా రామమందిరం అంశాన్ని లేవనెత్తాలని భావిస్తుంటే, మిగిలిన నాయకులు మాత్రం రామమందిరం అంశాన్ని పక్కనపెట్టి అభివృద్ది మంత్రంతోనే యూపి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఎటుచూసినా కూడా యుపి అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి,మోడీకి అత్యంత కీలకమైనవి. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో 70కి పైగా సీట్లను గెలుచుకుని కేంద్రంలో అధికారం చేపట్టడానికి యూపీ కీలకంగా నిలిచింది. ఇక వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నిలను మోడీ పాలనకు రెఫరెండంగా భావించవచ్చు. అక్కడి ఎన్నికలు.. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరలా మోడీ గెలుస్తాడా? కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం విజయం సాధిస్తుందా? లేదా? అనేది తేల్చేస్తాయి. మరి యూపి ఎన్నికల్లో బిజెపి ఏ నినాదంతో ముందుకెళ్తుందనే విషయం ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతోంది.