ఆంధ్రాకు చెందిన వెంకయ్యనాయుడు, ఏపీ కోడలు నిర్మలా సీతారామన్‌లను కాదని, మహారాష్ట్రకు చెందిన కేంద్రరైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభును ఏపీ నుండి రాజ్యసభకు పంపే విషయంలో బిజెపి అధిష్టానం ముందు చూపుతో వ్యవహరించింది. అదే వెంకయ్య, నిర్మాలా సీతారామన్‌లలో ఒకరిని ఏపీ నుండి రాజ్యసభకు పంపిస్తే భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే ఇబ్బందులను వారు ముందుగానే గ్రహించారు. భవిష్యత్తులో ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు పలు హామీలను కేంద్రం నెరవేర్చకపోతే ఏపీ ప్రజల నుండి వెంకయ్యను లేదా నిర్మాలాను రాజీనామా చేయాలనే డిమాండ్ ఖచ్చితంగా వస్తుంది. అందుకే వెంకయ్యకు, నిర్మాలా సీతారామన్‌లకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవ్వకుండా బిజెపి వెంకయ్యను రాజస్ధాన్ నుండి నిర్మాలాను కర్ణాటక నుండి రాజ్యసభకు పంపే యోచన చేసింది. ఇక రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ఆంధ్రాకు ఏమాత్రం సంబంధం లేని వాడు కావడం, వచ్చే ఏడాది రైల్వే బడ్జెట్‌లో విశాఖకు ప్రత్యేక జోన్ ఇవ్వడం కష్టమేమీ కాకపోవడం, దానికి పెద్దగా ఆర్ధికంగా కూడా ఖర్చు ఉండదు కాబట్టి విశాఖకు రైల్వేజోన్ ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలా చేస్తే సురేష్‌ప్రభును ఏపీ ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. అంతే కాదు.. ఇప్పటికే ఏపీ నుండి ప్రత్యేకహోదా తీసుకొని రాలేదని వెంకయ్య, నిర్మలపైన ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారిని ఏపీ నుండి రాజ్యసభకు పంపితే ఆ కోపం మరింత రాజుకుంటుంది.ఇలాంటివన్నీ ఆలోచించే చివరకు సురేష్ ప్రభును ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.