ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు హీరో రాజ్ తరుణ్. వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఈ హీరో రీసెంట్ గా 'ఈడో రకం.. ఆడో రకం' సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్ తరుణ్ తో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ముందుకు వస్తున్నారు. తొందరపడి స్క్రిప్ట్స్ ఓకే చేయకుండా కథల విషయంలో విభిన్నత చూపించాలనుకుంటున్నాడు. ఈ నేపధ్యంలోనే దర్శకుడు వంశీ కృష్ణ చెప్పిన క్రైమ్ కామెడీ కథను ఓకే చేశాడని తెలుస్తోంది. వంశీ కృష్ణ గతంలో మంచు లక్ష్మీతో 'దొంగాట' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో కామెడీకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఆ తరువాత మాత్రం ఈ దర్శకుడికి అవకాశాలు రాలేదు. చాలా రోజుల గ్యాప్ తరువాత వంశీ చెప్పిన కథ రాజ్ తరుణ్ కు నచ్చడంతో వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వంశీ కృష్ణ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.