చంద్రబాబుకు తెలిసినంతగా రాజకీయ జిమ్మిక్కులు మరెవరికీ తెలియవేమో. ఆయన తెలివిగా జగన్ పార్టీని ఇరకాటంలో పెట్టేశారు. రాజ్యసభ ఎన్నికల్లో నాలుగవ అభ్యర్థిని నిలబెడతామని సంకేతాలు ఇవ్వడంతో వైకాపా వణికిపోతోంది. తన అనుకూల మీడియా ద్వారా అన్యాయం, అక్రమం అంటూ కథనాలు రాయించింది. ఎమ్మెల్యేలను కొనడం ద్వారా నాలుగవ అభ్యర్థిని గెలిపించుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారనేది జగన్ పార్టీ అభియోగం. పదే పదే కొంటున్నారనే ఆరోపణలు చేయడం వల్ల తన ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడు బోతారని అంగీకరించినట్టే అవుతుంది. ఇది వైకాపా ఎమ్మెల్యేలలో అంతర్మదనానికి దారితీస్తుంది. సాక్షి మీడియా ద్వారా చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు గుప్పించినప్పుడల్లా ఆయన కొత్త ఎత్తులు వేస్తూ జగన్ కు నిద్రపట్టకుండా చేస్తున్నారు.
వైకాపా బలం ప్రకారం ఒక రాజ్యసభ స్థానాన్ని సునాయసంగా గెలుచుకోవచ్చు. చంద్రబాబు మూడు సీట్లు గెలుచుకోగలరు. నాలుగవ అభ్యర్థిని రంగంలోకి దించి ప్రతిపక్షాన్ని ఇబ్బందిపెట్టాలనే ఆయన ఎత్తుగడకు జగన్ ఈజీగా పడిపోయారు. వైకాపా ఎమ్మెల్యేలను చంద్రబాబు ఆకర్షిస్తే తమ అభ్యర్థి ఓడిపోయే ప్రమాదం ఉందనేది జగన్ భయం. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, ఆ విషయం బయటపడకుండా జాగ్రత్తగా ఉండాల్సింది. కనీసం మేకపోతు గాంభీర్యం సైతం ప్రదర్శించకుండా చంద్రబాబు బుట్టలో పడిపోయారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
రాజకీయాల్లో ఇలాంటి ఎత్తుగడలు సహజం. కొన్ని సార్లు గెలిచే అవకాశం లేకున్నా తమ ఓట్లను కాపాడుకోవడానికి ఇలాంటి ఎత్తుగడలు వేస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ అభ్యర్థి గెలవాలంటే 36 ఓట్లు కావాలి. వైకాపా ఒరిజినల్ బలం 67 మంది శాసనసభ్యులు. ఇందులో 17 మంది తెదేపాకు జంప్ అయ్యారు. అయితే సాంకేతికంగా పార్టీ మారిన వాళ్ళు కూడా వైకాపాకే చెందుతారు. ఎన్నికల్లో విప్ జారి చేస్తారు. పైగా ఓటు ఎవరికి వేసింది బహిరంగంగా చూపించాలి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వైకాపా మరో అభ్యర్థిని కూడా పోటీకి నిలబెట్టి జంప్ ఎమ్మెల్యేలకు, అధికార పార్టీకి సవాల్ విసిరాల్సింది. ఈ అవకాశాన్ని వైకాపా పోగొట్టుకుంది. జగన్ కు సలహాలిచ్చే వారికైనా ఈ ఆలోచన వచ్చి ఉంటే బావుండేది