అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో విడుదలయిన చిత్రం 'సరైనోడు'. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. వంద కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరిందని చిత్రబృందం వెల్లడిస్తోంది. బన్నీకు తెలుగుతో పాటు మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. తను నటించే ప్రతి సినిమాను మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటాడు. అక్కడ వారంతా బన్నీను ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటుంటారు. అయితే 'సరైనోడు' సినిమాను కూడా 'యోధావు' అనే పేరుతో మలయాళంలో రిలీజ్ చేశారు. సుమారుగా 80 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఎనభై థియేటర్స్ అంటే అక్కడ పెద్ద నెంబర్ అనే చెప్పాలి. మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకుంది. తనకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులను నేరుగా కలవాలని బన్నీ కేరళకు ప్రయాణమవుతున్నాడు. అక్కడ ఉన్న ప్రతి ప్రాంతంలో బన్నీ పర్యటించనున్నాడని సమాచారం. అటు అభిమానులను పలకరించడంతో పాటు ఇటు తన సినిమా ప్రమోషన్స్ కు కూడా ఈ ట్రిప్ ఉపయోగపడుతుందని బన్నీ భావిస్తున్నాడు.