రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఎప్పుడో విడుదలైంది. తెలంగాణకు వచ్చే రెండు సీట్లకు గాను కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల పేర్లు ఖరారైపోయాయి. రేసులో పోటీ పడాలని భావించిన కాంగ్రెస్‌కు చెందిన వి.హన్మంతరావు పోటీ చేయకపోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం ఖాయమైపోయింది. వి.హెచ్. తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినప్పటికీ చివరకు ఓటమి తప్పదని తేలడంతో రేసు నుండి విరమించారు. తాజాగా ఆయన తెలంగాణ పి.సి.సి.చీఫ్ పదవిని ఆశిస్తున్నారని సమాచారం. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్దానంలో తనకు అవకాశం ఇవ్వమని ఆయన అధిష్టానాన్ని వేడుకొంటున్నాడు. ఇక ఏపీలో నాలుగు సీట్లుకు పోటీ జరుగనుంది. వైయస్సార్‌సీపీకి లభించనున్న ఒక్క సీటుకు ఆ పార్టీ అధినేత జగన్ విజయసాయిరెడ్డిని బరిలోకి దించాడు. కాగా టిడిపి - బిజెపి మిత్రపక్షాలకు మూడు సీట్లు దక్కనున్నాయి. ఇందులో ఒక స్థానాన్ని బిజెపికి కేటాయించి మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాజ్యసభ టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నప్పటికీ బిజెపి అధిష్టానం మాత్రం తమకు సీటు కావాలని అడగకుండా బెట్టు చూపిస్తోంది. ఇక రెండు సీట్ల స్ధానంలో ఒకటి కేంద్రమంత్రి సుజనాచౌదరికి ఖాయం అయిందంటున్నారు. మిగిలిన ఒక్క స్దానానికి మాత్రం పెద్ద పోటీ ఏర్పడింది. తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నరహింహులు మాత్రం ఆ సీటును తనకు కేటాయించాలని మహానాడు సాక్షిగా తన గోడు వెల్లబోసుకున్నాడు. తెలంగాణలో తాను టిడిపి కోసం చేస్తున్న కృషిని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదిరించిన సంగతిని గుర్తు చేశాడు. కానీ ఇంతకు ముందే నారా లోకేష్ ఏపీ రెండు స్దానాలకు ఏపీ వారే పోటీ చేస్తారని, తెలంగాణ నేతలకు అవకాశం ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా రాజ్యసభ రెండో స్దానాన్ని తన రాజగురువు రామోజీరావు కోడలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజాకిరణ్‌కు కేటాయించవచ్చనే ప్రచారం జరుగుతోంది. కానీ అది కేవలం ప్రచారం మాత్రమే అని, ఆ రెండో స్దానాన్ని దళిత మహిళకు, లేదా కాపు నాయకునికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ సంబంధికుల సమాచారం.