నేటిరోజుల్లో ప్రతి రాజకీయపార్టీకి తమ విధి విధానాలు, అభిప్రాయాలను ప్రజలకు చేరువచేయడానికి, తమ ప్రత్యర్ది పార్టీలను ఎండగట్టడానికి సొంతగా మీడియా ఉండటం అత్యవసరం అయిపోయింది. టిడిపికి అంటూ ఏ సొంత మీడియా లేకపోయినా మీడియా మేనేజ్‌మెంట్‌లో మాత్రం చంద్రబాబు ఆరితేరిపోయిన వ్యక్తి. జగన్ మీడియా తప్ప అన్ని ఇతర మీడియాలను ఆయన తనకు ప్రాధాన్యం ఉండేలా చేసుకొంటున్నాడు. ఇక తమ కోసం 'సాక్షి' పత్రికను, 'సాక్షి' ఛానెల్‌ను జగన్ పెట్టినప్పటికీ వాటిపై జగన్ కరపత్రాలు అనే అపవాదు పడింది. దాంతో ఆ మీడియాకు విశ్వసనీయత లేకుండా పోయింది. కాగా మిగిలిన న్యూస్‌చానెల్స్‌లో కూడా జగన్ వాటాలు తీసుకొని ఉన్నాడు. కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ కావడం లేదు. దాంతో బాగా ఆలోచించిన జగన్ తన పెట్టుబడితో త్వరలో తనవి అని జనాలకు తెలియకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ మరో మూడు న్యూస్ చానెల్స్‌ను స్దాపించే యోచనలో ఉన్నాడు. దాసరి నారాయణారావు, ఎంపీ మిధున్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ రాజమోహన్‌రెడ్డి తనయుడు, జగన్‌కు అత్యంత స్నేహితుడు, ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిల ఆధ్వర్యంలో ఈ మూడు చానెల్ ప్రారంభం కానున్నాయి. మొత్తానికి 'సాక్షి' ఒంటరిదిగా మారిపోయిన నేపథ్యంలో ఈ మూడు చానెల్స్ కూడా చంద్రబాబు వ్యతిరేక మీడియాగా మారి, వీక్షకులకు వైసీపీ విధానాల పట్ల అవగాహన కలిగించేందుకు ఉపయోగపడనున్నాయి. మరి వీటికి ఎంత ఆదరణ వస్తుందో చెప్పలేం కానీ.. కొందరు నిరుద్యోగ జర్నలిస్ట్‌లకు మాత్రం ఈ ఛానెల్స్ వల్ల ఉపాధి కలుగనుంది అనేది వాస్తవం.