ఓ సినిమా ప్రీ ప్రొడక్షన్ టైమ్‌లో పలువురు టెక్నీషియన్స్ పేర్లు చర్చకు రావడం, చివరకు అందరికీ నచ్చినవాడిని ఎంచుకోవడం మామూలే. తాజాగా మాత్రం సినిమా షూటింగ్స్ మొదలయ్యాక కూడా అసలు టెక్నీషియన్స్ ప్లేస్‌లో వేరేవారినీ రీప్లేస్ చేస్తున్నారు. ఇగో ప్రాబ్లమ్స్ వల్ల గానీ, ఆయా టెక్నీషియన్స్ వర్క్ నచ్చకపోవడం వల్ల గానీ ఇది జరుగుతోందా? మరి వీటికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే చర్చ జరుగుతోంది. తాజాగా రామ్‌చరణ్, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో గీతాఆర్ట్స్ పతాకంపై తమిళ 'తన్ని ఒరువన్'కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న 'ధృవ' చిత్రం ఓ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆ చిత్రం సినిమాటోగ్రాఫర్ అసిమ్ మిశ్రా స్దానంలో పి.ఎ.వినోద్‌ను తీసుకున్నారు. రామ్‌చరణ్ సినిమాల విషయానికి వస్తే ఆయన నటించిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రానికి సంగీత దర్శకునిగా మొదట తమన్‌ని తీసుకొని ఆ తర్వాత ఆ స్ధానంలో యువన్‌శంకర్‌రాజాను రీప్లేస్ చేశారు. 'బ్రూస్‌లీ' విషయానికి వస్తే ముందు అనిరుద్ రవిచంద్రన్‌ని తీసుకొని ఆ తర్వాత అతడిని తొలగించి తమన్‌ను పెట్టుకున్నారు. ఇక పవన్‌కళ్యాణ్ 'సర్దార్‌గబ్బర్‌సింగ్' చిత్రానికి మొదట సినిమాటోగ్రాఫర్‌గా జయనన్ విన్సెంట్‌ను తీసుకుని మద్యలో ఆయన్ను తొలగించి ఆర్ధర్ ఎ విల్సన్‌ను తీసుకున్నారు. ఇక తాజాగా విడుదలకు సిద్దమవుతున్న త్రివిక్రమ్ 'అ..ఆ' చిత్రానికి సంగీత దర్శకునిగా మొదట అనిరుద్‌ని తీసుకొని ఆ తర్వాత మిక్కీ జె.మేయర్‌ను తీసుకున్నారు. మరి ఈ మార్పులు చేర్పులకు కారణం ఏమిటి? అనేది తెలియాల్సివుంది...!