రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ:పాతాళానికి చేరింది. ఇప్పుడప్పుడే ఆ పార్టీకి మరలా పుట్టగతులు ఉండబోవని అర్దమవుతోంది. అయినా కూడా ఏపీ పీసిసి ఛీఫ్ రఘువీరారెడ్డి మాత్రం ఏ మాత్రం అవకాశం వచ్చినా దానిని అంది పుచ్చుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు సంగతి పక్కనపెడితే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధులు కూడా దొరకని పరిస్థితి ఖాయం. కాగా కాంగ్రెస్‌పార్టీ తన ఇష్టానుసారం రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కాంగ్రెస్‌లోని అధికభాగం క్యాడర్ వైసీపిలో చేరింది. దీనివల్ల బాగా లబ్దిపొందింది టిడిపి కంటే వైసీపీనే. ఎంతోకాలంగా కాంగ్రెస్‌కు వెన్నుదున్నుగా ఉన్న మైనార్టీలు, రెడ్డి సామాజికవర్గం, దళితులు ఎక్కువగా వైసీపీ వైపు వెళ్లారు. వారిని మరలా తమ గూటికి చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో జగన్ ఎన్డీయే కూటమిలో చేరబోతున్నాడని, బిజెపితో ఆయన వచ్చే ఎన్నికల నాటికి దోస్తీ కట్టనున్నాడనే ప్రచారం ద్వారా బిజెపి అంటే పెద్దగా పడని మైనార్టీలను, దళితులను తమ వైపుకు తిప్పుకునే కార్యక్రమాలకు రాష్ట్ర కాంగ్రెస్ శ్రీకారం చుట్టనుంది. అయినా కూడా కాంగ్రెస్‌ను ఎందుకు నమ్ముతారు? వైసీపీని వీడి కాంగ్రెస్ వైపుకు ఇప్పుడిప్పుడే ఆ వర్గాలు వస్తాయా? అనేది సందేహమే మరి.