రాను రాను కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రవర్తన వల్ల చంద్రబాబు బాగా ఇరిటేట్ అవుతున్నాడని, చంద్రబాబు సహనాన్ని ఆయన పరీక్షిస్తున్నాడని తెలుస్తోంది. వాస్తవానికి ముద్రగడ వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ చేతిలో కీలుబొమ్మగా మారుతూ, జగన్‌కు మౌత్‌పీస్‌గా మారుతున్నాడని కాపు వర్గీయులే గుర్రుమంటున్నారు. ప్రతిసారి ఉద్యమం చేస్తానని, నిలదీస్తానని, నిరాహార దీక్ష చేస్తానని మాట్లాడుతూ ఆయన చంద్రబాబును ఉద్దేశిస్తూ రాస్తున్న లేఖలను, అందులో వాడుతున్న భాషను చూసి చంద్రబాబు చాలా కోపంగా ఉన్నాడని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు మాత్రమే అయిన తమను ఇంతలా ఇబ్బందిపెడుతున్న ముద్రగడ పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు... కాపుల సమస్యలు, కాపు జాతి అని మాట్లాడే ముద్రగడకు గుర్తురాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో కాపుల రిజర్వేషన్ అంశాన్ని పెట్టిన సంగతిని వారు గుర్తుచేస్తున్నారు. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆ పదేళ్లలో ముద్రగడకు కాపుల ప్రయోజనాలు గుర్తుకు రాలేదా? అనే అంశాన్ని ఆ సామాజిక వర్గానికి చెందినవారే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రికి ఆయన రాస్తున్న లేఖలో వాడుతున్న భాష బెదిరింపు ధోరణిలో ఉండటం ఏమిటని? చంద్రబాబు కూడా ఆగ్రహంగా ఉన్నారు.